- ఈ బాధ్యతనుపసుపు బోర్డు తీసుకోవాలి
- టర్మరిక్ వాల్యూ చైన్ సమిట్–2025లో మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుగు: దేశీయ పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీపడే స్థాయికి తీసుకెళ్లాలని, ఇందుకు సమష్టి కృషి అవసరమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఈ బాధ్యతను పసుపు బోర్డు తీసుకోవాలని ఆయన సూచించారు.
సీఐఐ తెలంగాణ, నేషనల్ టర్మరిక్ బోర్డు సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన‘ టర్మరిక్ వాల్యూ చైన్ సమిట్–-2025’లో ఆయన పాల్గొని మాట్లాడారు. తాము ఇటీవల ప్రకటించిన అగ్రి విజన్–-2047లో వ్యవసాయాన్ని కేవలం సంక్షేమ రంగంగా కాకుండా, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా పరిగణిస్తున్నామని తెలిపారు. ఈ విజన్‌లో పసుపు పంటకు కీలక పాత్ర ఉందని మంత్రి చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా పసుపు సాగులో భారత్ అగ్రస్థానంలో ఉందని, రాష్ట్రంలో నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతాలు ముందున్నాయని పేర్కొన్నారు. ఆర్మూర్ పసుపు పంటకు జీఐ ట్యాగ్ రావడం రైతులకు గర్వకారణమని తుమ్మల వివరించారు. నిజామాబాద్ లో నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు అయినప్పటికీ, అది పూర్తిస్థాయిలో కార్యాచరణలోకి దిగాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఈ బోర్డు రైతులకు పాలసీ దిశ చూపాలని, పరిశోధనను పొలాలకు తీసుకెళ్లాలని, మార్కెటింగ్, బ్రాండింగ్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టర్మరిక్ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, టర్మరిక్ బోర్డు సెక్రటరీ భవానీ శ్రీ, సీఐఐ తెలంగాణ చైర్మన్ శివ ప్రసాద్ రెడ్డి, అగ్రి యూనివర్సిటీ మాజీ వీసీ ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు.
