చిట్యాల, వెలుగు: హెచ్ సీఏ, నల్గొండ జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో కాక స్మారక టీ20 క్రికెట్ టోర్నీ ఎంపిక పోటీలు మంగళవారం ముగిశాయి. నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి150 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ చాటిన వారిని సెలెక్ట్ చేసి మూడు జిల్లాల జట్లను ఎంపిక చేసినట్లు నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సయ్యద్ అమినో ఉద్దీన్ తెలిపారు.
మూడు టీంలు ఈ నెల 23 నుంచి 27 వరకు నల్గొండలో జరిగే అంతర్ జిల్లా పోటీల్లో తలపడుతాయని పేర్కొన్నారు. మూడు జిల్లాల జట్లలో ప్రతిభ చూపిన క్రీడాకారులతో ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టును ఎంపిక చేస్తామన్నారు. ఈ జట్టు ఈ నెల చివరి వారంలో విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యం తో హెచ్ సీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించనున్న కాక వెంకటస్వామి స్మారక టీ20 క్రికెట్టోర్నీలో పాల్గొంటుందని వివరించారు.
