పైసలిచ్చినా ఓట్లు వేయరా? ఓటర్లతో గొడవకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు

పైసలిచ్చినా ఓట్లు వేయరా?    ఓటర్లతో గొడవకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు
  • ఇరువర్గాల మధ్య తోపులాట

శివ్వంపేట, వెలుగు: సర్పంచ్​గా పోటీ చేసి ఓడిపోయిన ఓ అభ్యర్థి అనుచరులు ఓటర్లతో గొడవకు దిగారు. డబ్బులు తీసుకుని ఓటు వేయలేదంటూ వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన మెదక్​జిల్లా శివ్వంపేట మండలంలోని భీమ్లాతండాలో చోటుచేసుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సరితపై కాంగ్రెస్ మద్దతుతో పోటీచేసిన లక్ష్మి గెలుపొందారు. 

దీంతో తండాలో డబ్బులు ఇచ్చినప్పటికీ ఓట్లు వేయలేదంటూ సరిత వర్గీయులు ఆందోళన చేశారు. శంకర్ తండాలో బీఆర్​ఎస్​ కార్యకర్తలు ఓటర్లతో గొడవ పడ్డారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. మాటామాటా పెరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్సై మధుకర్ రెడ్డి తన సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇరువురిని చెదరగొట్టారు. డబ్బులు ఇచ్చినా ఓట్లు వేయలేదంటూ సరిత కుటుంబ సభ్యులు బోరున విలపించారు. దీంతో శంకర్ తండా వాసులు డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పడంతో వారు అక్కడి నుంచి  వెళ్లిపోయారు.