65 ఏండ్లకు పోలింగ్..బరంపూర్ జీపీలో ఇప్పటివరకు ఏకగ్రీవంగానే సర్పంచుల ఎన్నిక

65 ఏండ్లకు పోలింగ్..బరంపూర్ జీపీలో ఇప్పటివరకు ఏకగ్రీవంగానే సర్పంచుల ఎన్నిక
  • మొదటిసారి ఓటేసి మురిసిపోయిన గ్రామస్తులు

ఆదిలాబాద్, వెలుగు: తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో మొదటిసారి సర్పంచ్​ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. 65 ఏళ్లుగా ఈ గ్రామంలో సర్పంచ్ ను ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నారు. ఈసారి బరిలో ఇద్దరు అభ్యర్థులు ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది. 1956లో గ్రామపంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి బరంపూర్​లో గ్రామ పెద్దల తీర్మానంతో సర్పంచ్​లను ఏకగ్రీవం చేసుకుంటూ వస్తున్నారు. 20 ఏండ్లు జనరల్, పదేళ్లు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించగా గత 35 ఏళ్ల నుంచి ఇక్కడ ఎస్టీ రిజర్వుడ్​గా ఉంది. బరంపూర్ పంచాయతీ పరిధిలోకి కొలంగూడ, మదన్ పూర్ గ్రామాలు కూడా వస్తాయి. మొత్తం 10 వార్డులుండగా, 2,300 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సారి బీఆర్​ఎస్​ బలపరిచిన అభ్యర్థి మేస్రం దేవురావు, కాంగ్రెస్​ బలపరిచిన అభ్యర్థి సిడాం లక్ష్మణ్ రావు బరిలో నిలవగా దేవురావు గెలుపొందారు. మొదటిసారి సర్పంచ్​ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం దక్కడంతో బరంపూర్​ గ్రామస్తులు మురిసిపోయారు. 

రుయ్యాడంలో వార్డులకే పోలింగ్..

తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామం ఎస్టీకి రిజర్వ్​ కాగా, ఇక్కడ ఒక్క ఎస్టీ కుటుంబం కూడా లేకపోవడంతో 19 ఏళ్లుగా కేవలం వార్డు సభ్యులకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. వార్డు సభ్యుల్లోనూ ఐదు వార్డులు మినహా మిగతావి ఎస్టీ రిజర్వుడే. దీంతో ఐదు వార్డుల్లో ఎన్నికలు నిర్వహించి ఉప సర్పంచ్​ను ఎన్నుకుంటున్నారు. అందుకే ఇక్కడ కొన్నాళ్లుగా ఉప సర్పంచ్​ పాలనే కొనసాగుతోంది.