- జాతీయ ఎంట్రెన్స్‌లకు అనుగుణంగా సిలబస్‌లో భారీ మార్పులు
- పేజీల్లో కొత్తగా డిజిటల్ ‘క్యూఆర్’కోడ్స్
- స్కాన్ చేస్తే మొబైల్‌లో డిజిటల్ పాఠాలు
- ఏర్పాట్లు చేస్తున్న ఇంటర్మీడియెట్ అధికారులు
హైదరాబాద్, వెలుగు: సర్కార్ ఇంటర్మీడియెట్ కాలేజీల స్టూడెంట్లకు టెక్ట్స్ బుక్స్ కోసం ఎదురు చూసే తిప్పలు తప్పనున్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్యపుస్తకాలను ఏప్రిల్‌లోనే అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఇంటర్మీడియెట్ కమిషరేట్ అధికారులు చర్యలు ప్రారంభించారు. దీనికితోడు ఈసారి పుస్తకాలను హైటెక్ హంగులతో తీసుకురాబోతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 430 సర్కారు జూనియర్ కాలేజీలు ఉండగా, వాటిలో 1.70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వమే ఉచితంగా పుస్తకాలను అందిస్తోంది. ఏటా వీటిని తెలుగు అకాడమీ ద్వారా ప్రింట్ చేయించి, కాలేజీలకు సరఫరా చేస్తున్నారు. గత కొన్నేండ్లుగా విద్యార్థులకు పుస్తకాలు ఆలస్యంగా చేరుతున్నాయి. ఆగస్టు నుంచి అక్టోబర్ దాకా పంపిణీ ప్రక్రియ కొనసాగేది.
దీంతో పుస్తకాల్లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లు. మార్కెట్‌లో పుస్తకాలు రాకపోవడంతో, ప్రైవేటు పబ్లిషర్స్‌కు చెందిన పుస్తకాలు, పాత పుస్తకాలతో చదువులు సాగించారు. ఈ తిప్పలు తప్పేలా విద్యార్థులకు ఏప్రిల్ నెలలోనే మార్కెట్‌లో పుస్తకాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సర్కారు కాలేజీల విద్యార్థులకు కాలేజీలు రీఓపెన్ రోజే పుస్తకాలు అందించాలని నిర్ణయించారు.
కొత్త సిలబస్.. కొత్త పుస్తకాలు..
వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్ సిలబస్ మారనున్నది. ప్రధానంగా సైన్స్ సబ్జెక్టుల్లో భారీగా సిలబస్‌కు కోత పెడుతున్నారు. జాతీయ స్థాయి ఎంట్రెన్స్‌లు జేఈఈ, నీట్‌తో పాటు ఎప్ సెట్ సహా పలు ప్రవేశ పరీక్షల్లో క్వశ్చన్లు రాని, ప్రాధాన్యత లేని సిలబస్ ఎత్తేయ్యాలని అధికారులు నిర్ణయించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, కామర్స్, ఎకనామిక్స్ తదితర సబ్జెక్టుల్లో సిలబస్ భారీగానే తగ్గనున్నది.
ఈ క్రమంలో కనీసం 10 శాతం నుంచి 30 శాతం వరకు పాత సిలబస్ కట్ అయ్యే అవకాశాలున్నాయి. దీనికి అనుగుణంగానే 2026–27లో పుస్తకాలు బయటకు రానున్నాయి. మరోవైపు, చరిత్రలో తొలిసారిగా ఇంటర్ పాఠ్యపుస్తకాల పేజీల్లో ‘క్యూఆర్ కోడ్స్’ను ముద్రిస్తున్నారు. ఈ కోడ్‌ను స్కాన్ చేయగానే ఆ సబ్జెక్టుకు సంబంధించిన డిజిటల్ కంటెంట్ ఓపెన్ అయ్యేలా సరికొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు.
కంటెంట్, క్వాలిటీయే కీలకం..
ఇంటర్ పాఠ్య పుస్తకాలను సకాలంలో విద్యార్థులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నం. ఏప్రిల్‌లోనే మార్కెట్‌లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. పుస్తకాల్లో కంటెంట్‌తో పాటు పేపర్ క్వాలిటీగా ఉండేలా చూస్తున్నాం. ఎన్‌సీఈఆర్టీ నిబంధనలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేశాం. తొలిసారిగా డిజిటల్ క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తున్నాం. వీటన్నింటికీ అనుగుణంగానే వచ్చే విద్యా సంవత్సరం కొత్త పుస్తకాలు రానున్నాయి.
- కృష్ణ ఆదిత్య, ఇంటర్ విద్య డైరెక్టర్
