- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల కొత్త పాలకవర్గాలు కొలువు దీరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యుల తొలి సమావేశం నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. తొలుత ఈ నెల 20న సర్పంచుల అపాయింటెడ్ డేగా నిర్ణయించగా.. అయితే, ఆ రోజు సరైన ముహూర్తాలు లేవని, అమావాస్య కావడంతో సెంటిమెంట్ ఉందని పలువురు ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
దీంతో 20 నుంచి 22వ తేదీకి ప్రమాణస్వీకార తేదీని మార్చారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలుపొందినవారు ఈ నెల 22న ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. కాగా, అనివార్య కారణాల వల్ల ఎన్నికలు జరగని గ్రామ పంచాయతీలకు ఈ తేదీ వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
