డిసెంబర్ 19 నుంచి పుస్తకాల పండుగ.. 11 రోజుల పాటు సాహిత్య జాతర

 డిసెంబర్ 19 నుంచి పుస్తకాల పండుగ.. 11 రోజుల పాటు సాహిత్య జాతర
  • 365 స్టాల్స్​ ఏర్పాటు  
  • మధ్యాహ్నం ఒంటి గంట నుంచి  రాత్రి 9 గంటల వరకు 
  • సెల్ఫీ స్పాట్​గా ‘చార్మినార్’

హైదరాబాద్​ సిటీ, వెలుగు: లోకకవి అందెశ్రీ పేరుతో నగరంలో పుస్తకాల పండుగ మొదలుకాబోతోంది. డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్​స్టేడియంలో నేషనల్​బుక్​ఫెయిర్​సందడి చేయబోతోంది. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం హైదరాబాద్​ బుక్​ ఫెయిర్​అధ్యక్షుడు యాకూబ్​షేక్, సెక్రటరీ ఆర్​వాసు వెల్లడించారు. 

ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు బుక్​ఫెయిర్​ఉంటుందని చెప్పారు. గతేడాది దాదాపు 10 మంది లక్షల మంది బుక్ ఫెయిర్​ను సందర్శించగా.. ఈ ఏడాది 12 నుంచి 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.  

స్టూడెంట్స్, టీచర్స్​కు ఫ్రీ  

బుక్​ఫెయిర్​లో గతేడాది 360 స్టాల్స్ ఏర్పాటు చేయగా.. ఈసారి 365 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బుక్​ఫెయిర్​ఎంట్రీ ఫీజు రూ.10గా నిర్ణయించారు. అయితే, విద్యార్థులకు, వారితో వచ్చిన టీచర్లు గుర్తింపు కార్డు చూపిస్తే ఉచిత ప్రవేశం ఉంటుంది. 

ఆవిష్కరణకు వేదికలు 

పుస్తకాల ఆవిష్కరణకు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు బుక్​ఫెయిర్​లో ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. బుక్​ఫెయిర్​ప్రాంగణానికి లోకకవి అందె శ్రీ పేరును, ప్రధాన వేదికకు అనిశెట్టి రజిత పేరు, పుస్తకాల ఆవిష్కరణ వేదికకు కొంపల్లి వెంకట్​గౌడ్​పేరు పెట్టారు. రజిత, వెంకట్​గౌడ్​ వేదికలపై 10 రోజుల్లో సుమారు 50  కొత్త పుస్తకాలు రిలీజ్​కానున్నాయి. 

తెలంగాణ వంటకాలతో.. 

బుక్ ఫెయిర్​కు వచ్చేవారి కోసం తెలంగాణ వంటకాలతో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ధరలు అందుబాటులో ఉంటాయని, నాణ్యతలో రాజీ పడడం లేదన్నారు. ఈ సారి ప్రధాన వేదికకు ఎదురుగా  చార్మినార్ మోడల్​ ఏర్పాటు చేసి దాన్ని సెల్ఫీ స్పాట్​గా మలిచామన్నారు. సందర్శకులను ఇది కట్టిపడేస్తుందన్నారు. చిన్నారులు ఆడుకోవడానికి కిడ్స్ ప్లే ఏరియాతోపాటు తల్లిదండ్రులకు సిట్టింగ్ ఏరియాను సిద్ధం చేసినట్టు చెప్పారు.  

రోజూ బాలోత్సవ్​..

బుక్​ఫెయిర్​వేదికగా ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4గంటల వరకు బాలోత్సవ్​కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యువతకు డ్రగ్స్​నివారణపై, మొబైల్​వాడకం వల్ల నష్టాలను, సైబర్​ నేరాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా స్కిట్ల్స్​వేస్తున్నట్టు తెలిపారు. ప్రముఖ రచయితలను, సాహితీవేత్తలను ఆహ్వానించి వారిని ప్రభావితం చేసిన పుస్తకాలపై చర్చలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 11 రోజుల పాటు జరిగే ఈ సాహిత్య కార్యక్రమంలో సాహితీ ప్రియులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.  

15 లక్షల మందికి తగ్గ ఏర్పాట్లు 

నగరంలో 38 ఏండ్లుగా హైదరాబాద్​బుక్​ఫెయిర్​జరుగుతోంది. ఏటా లక్షలాది మంది పుస్తకప్రియులు ఈ బుక్​ఫెయిర్​ను సందర్శిస్తున్నారు. ఈ ఏడాది11 రోజుల్లో సుమారు15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే స్టాళ్ల ఏర్పాట్లు, వేదిక నిర్మాణం పూర్తయ్యింది. పుస్తక ప్రియులు ఈ పండుగలో పాల్గొని, విజయవంతం చేయాలి. - యాకూబ్​ షేక్​, వాసు,బుక్​ ఫెయిర్​ ప్రెసిడెంట్, సెక్రటరీ