Swiggy, Zomato యూజర్లకు డబుల్ షాక్.. ఫుడ్ డెలివరీపై జీఎస్టీ మోత..

Swiggy, Zomato యూజర్లకు డబుల్ షాక్.. ఫుడ్ డెలివరీపై జీఎస్టీ మోత..

సెప్టెంబర్ 22 నుంచి స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆహారం ఆర్డర్ చేసే వినియోగదారులపై కొత్త భారం పడనుంది. జీఎస్టీ మార్పుల కారణంగా డెలివరీ ఛార్జీలపై 18% GST అమలులోకి రాబోతోంది. ఇప్పటివరకు కేవలం డెలివరీ చార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉండగా.. ఇకపై ఆ ఛార్జీలపై అదనంగా పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రతి ఆర్డర్ బిల్లు మరింత పెరుగనుంది.

స్విగ్గీ ఇప్పటికే కొన్ని నగరాల్లో తన ప్లాట్‌ఫామ్ ఛార్జీలను GSTతో కలిపి రూ.15కు పెంచగా, జొమాటో రూ.12.50 వసూలు చేయడం ప్రారంభించింది. మ్యాజిక్‌పిన్ ఆర్డర్‌కు రూ.10 ప్లాట్‌ఫామ్ ఫీజు వసూలు చేస్తోంది. భారత ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. స్థానిక డెలివరీ సేవలు అందించే వారందరూ 18% GST పరిధిలోకి వస్తారు. డెలివరీ సేవ రిజిస్టర్డ్ వ్యక్తి నేరుగా అందిస్తే అతడు GST చెల్లించాలి. రిజిస్టర్డ్ కాని వ్యక్తి ECO (ఇ-కామర్స్ ఆపరేటర్) ద్వారా సేవ అందిస్తే.. ఆ ఇ-కామర్స్ ఆపరేటర్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ వ్యక్తి ECO ద్వారా సేవ అందిస్తే 18% GST అతడే చెల్లించాలి.

Also Read:-పాలు నెయ్యి రేట్లు తగ్గించిన మథర్ డెయిరీ.. మిల్క్ షేక్స్ రేట్లు ఎంత తగ్గాయంటే?

ఈ కొత్త విధానంతో వినియోగదారులకు అదనపు భారంగా మారనుంది. ఇప్పటికే పెరిగిన ప్లాట్‌ఫామ్ ఛార్జీలపై మళ్లీ పన్ను చేర్చడం వల్ల చిన్న మొత్తాల్లోనూ వ్యత్యాసం ఎక్కువగా కనిపిస్తుంది. ఉదాహరణకు జొమాటో ద్వారా ఆర్డర్ చేస్తే సగటున రూ.2 అదనంగా, స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేస్తే సుమారు రూ.2.6 అదనంగా ఫుడ్ ఆర్డర్ చేసిన యూజర్లు చెల్లించుకోవాల్సి ఉంటుంది. 

ఫుడ్ డెలివరీ కంపెనీలు ఇప్పటి వరకు ఎక్కువగా ఆహార ఆర్డర్లపైనే ఆదాయం పొందేవి. కానీ ఇటీవల కాలంలో ప్లాట్‌ఫామ్ ఫీజులు, డెలివరీ ఛార్జీలు పెంచుతూ కొత్త ఆదాయ మార్గాలను పొందుతున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావం లక్షలాది ఆన్‌లైన్ వినియోగదారులపై నేరుగా పడుతోంది. ఇకపై సౌకర్యం, సరసమైన ధరలు రెండూ ఒకే సమయంలో పొందటం పెరుగుతున్న చార్జీల మోత చూస్తుంటే కష్టమే అనిపిస్తోందని యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.