
- కొనుగోలు చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వినతి
- భారీగా నష్టాలు రావడం, అప్పులు పెరగడమే కారణం
- మెట్రో విస్తరణలో పాల్గొనలేమని ప్రకటన
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుతో తీవ్రంగా నష్టపోయిన ఎల్ అండ్ టీ, తన వాటాలను విక్రయించేందుకు రెడీగా ఉన్నామని ప్రకటించింది. రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని కోరుతోంది. భారీగా నష్టాలు వస్తుండడం, అప్పులు పెరిగిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త స్పెషల్ పర్పోజ్ వెహికల్ (ఎస్‌పీవీ) ద్వారా ఈ విక్రయం జరగాలని కోరింది. ఇందుకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్‌కు లెటర్ పంపింది.
రూ.626 కోట్ల లాస్
ఎల్ అండ్ టీ మెట్రో రైల్‌కు కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.1,108.54 కోట్ల ఆదాయం రాగా, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.1,399.31 కోట్లతో పోలిస్తే 21శాతం తగ్గింది. నికర నష్టం రూ.555.04 కోట్ల నుంచి రూ.626 కోట్లకు చేరుకుంది. ఇది 13శాతం పెరుగుదల. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు 10 బ్యాంకుల కన్సార్టియం (ఎస్‌బీఐ నేతృత్వంలో) నుంచి అప్పులు తీసుకుంది. వీటిని ఇంకా తీర్చలేదు.
2017లో రూ.3,756 కోట్ల క్లెయిమ్‌ను రాష్ట్రానికి సమర్పించగా, 2020లో మెట్రో పూర్తయ్యే సమయానికి అది రూ.5 వేల కోట్లకు పెరిగింది. కొవిడ్ సమయంలో 169 రోజులు పాటు మెట్రోను పూర్తిగా నిలిపేశారు. దీంతో బాగా నష్టపోయింది. వర్క్ ఫ్రం హోం విధానం కొనసాగుతుండడం, ట్రావెల్ కల్చర్ మార్పులతో మెట్రోల్లో ప్రయాణించే వారు తగ్గుతున్నారు. ఫలితంగా కంపెనీ టికెట్ రెవెన్యూ పడిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను పీపీపీ మోడల్‌లో విస్తరించాలని చూస్తోంది. కానీ, ప్రతిపాదించిన ఫేజ్-2 ఏ, బీ ప్రాజెక్టుల్లో పాల్గొనలేమని ఎల్ అండ్ టీ ఇప్పటికే స్పష్టం చేసింది.