Film Chamber Polls: హోరాహోరీగా ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. నిర్మాతల ఐక్యతే ఆయుధంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ ప్రచారం!

Film Chamber Polls: హోరాహోరీగా ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. నిర్మాతల ఐక్యతే ఆయుధంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ ప్రచారం!

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన 'ఫిల్మ్ ఛాంబర్' ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నారు.  రేపు ( డిసెంబర్ 28న ) ఎన్నికల పోలింగ్ జరగనుంది.  ఈ కీలక పోరులో గెలుపే లక్ష్యంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ సర్వసన్నద్ధమైంది. 2025-2027 'సంవత్సరానికి గాను ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో సీనియర్ నిర్మాతలు కె.ఎస్. రామారావు, అశోక్ కుమార్, దామోదర్ ప్రసాద్, రవి కిరణ్, ఎస్కేఎన్ పాల్గొని, పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్యానెల్ ఉద్దేశాలను స్పష్టం చేశారు. 

"విభజించు.. పాలించు" పద్ధతి సరైంది కాదు..

సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు మాట్లాడుతూ భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేశారు. "పెద్ద పెద్ద నిర్మాతలు ఎంతో కష్టపడి, క్రమశిక్షణతో కట్టిన వ్యవస్థ ఈ ఫిల్మ్ ఛాంబర్. ఇక్కడ చిన్న నిర్మాత, పెద్ద నిర్మాత అనే భేదాలు లేవు. కానీ కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పరిశ్రమను రెండుగా చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. గిల్డ్ వల్ల పరిశ్రమకు నష్టం లేదు, అక్కడ ఉన్నవారు కూడా సినిమాలను ముందుకు తీసుకెళ్లేవారే. అయితే, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ను పటిష్టం చేయాలంటే మాత్రం ప్రోగ్రెసివ్ ప్యానెల్‌ను గెలిపించాల్సిన అవసరం ఉంది అని ఆయన పిలుపునిచ్చారు.

అనుభవం ఉన్నవారికే పట్టం కట్టండి..

మరో నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ఆలస్యంపై క్లారిటీ ఇచ్చారు. మేము ఎప్పుడూ ఎన్నికలను కావాలని వాయిదా వేయలేదు. ట్రేడ్ బాడీ పటిష్టంగా ఉండాలంటే సరైన వ్యక్తులు నాయకత్వంలో ఉండాలి. గత ఐదేళ్లలో ఎవరెవరు సినిమాలు తీశారో, ఎవరికి ఇండస్ట్రీ సమస్యల మీద అవగాహన ఉందో సభ్యులు గమనించాలి. ఫిల్మ్ ఛాంబర్ అనేది మన సొంత ఆస్తి కాదు, అది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థను గౌరవించే వారికే ఓటు వేయండి అని కోరారు.

ఇన్సూరెన్స్ పేరుతో రాజకీయం వద్దు..

సంక్షేమ పథకాలపై వస్తున్న విమర్శలను నిర్మాత దామోదర్ ప్రసాద్ తిప్పికొట్టారు. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ అంశంపై ఆయన స్పందిస్తూ.. ఇన్సూరెన్స్ అనేది సంక్షేమానికి సంబంధించింది, దీనిని ఎన్నికలతో ముడిపెట్టడం సరికాదు. జీఎస్టీ నిబంధనల వల్లే కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. గతంలో అర్హుల కంటే అనర్హులకు ఎక్కువగా హాస్పిటల్ బిల్లుల రీయంబర్స్మెంట్ జరిగిన మాట వాస్తవం. మేము వ్యవస్థను ప్రక్షాళన చేసి, నిజమైన బాధితులకు సాయం అందేలా చూస్తాం అని స్పష్టం చేశారు.

►ALSO READ | CHAMPION Box Office: వసూళ్ల వేటలో ‘ఛాంపియన్’ దూకుడు.. 2 డేస్ బాక్సాఫీస్ ఎంతంటే?

చిన్న సినిమాలకు అండగా ఉంటాం..

చిన్న చిత్రాల నిర్మాతల భద్రత గురించి నిర్మాత రవి మాట్లాడుతూ.. మేము ఎవరి మీద పెత్తనం చేయడానికి ఇక్కడ లేము. ఇండస్ట్రీలో అందరూ సమానమే. చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపు నుంచి పంపిణీ వరకు మా పూర్తి మద్దతు ఉంటుంది. ఎవరికీ కీడు చేయకుండా, చేతనైనంత సాయం చేస్తూ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం అన్నారు.

ఫిల్మ్ ఛాంబర్ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో సభ్యులు ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి. అనుభవం, నిబద్ధత కలగలిసిన తమ ప్యానెల్‌ను ఆదరించాలని ప్రోగ్రెసివ్ సభ్యులు కోరుతున్నారు. రేపటి ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తోందో చూడాలి మరి..