2025లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 24వేల 600 మందికి పైగా భారతీయులు బహిష్కరణకు గురయ్యారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల రాజ్యసభలో వెల్లడించిన గణాంకాల ప్రకారం.. మొత్తం 81 దేశాలు భారతీయులను డిపోర్ట్ చేసి వెనక్కి పంపించాయి. ఆశ్చర్యకరంగా ఈ లిస్టులో అమెరికాను దాటేసి సౌదీ అరేబియానే అగ్రస్థానంలో నిలిచింది.
మొత్తం భారతీయుల డిపోర్టింగ్స్ ఎక్కువగా సౌదీ అరేబియా నుంచే ఉన్నాయి. 2025లో ఆ దేశం ఏకంగా 11వేల మందికి పైగా భారతీయులను వెనక్కి పంపింది. గల్ఫ్ దేశాల్లో వీసా లేదా రెసిడెన్సీ గడువు ముగిసినా అక్కడే ఉండటం, సరైన వర్క్ పర్మిట్లు లేకుండా పనిచేయడం, కార్మిక చట్టాలను ఉల్లంఘించడం వంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. చాలామంది తక్కువ నైపుణ్యం గల కార్మికులు ఏజెంట్ల ద్వారా వెళ్లి, తెలియక చిన్నపాటి నేరాలకు పాల్పడి బహిష్కరణకు గురవుతున్నారని తేలింది.
ట్రంప్ ప్రభుత్వ హయాంలో వీసాలు, వర్క్ పర్మిట్లపై నిఘా పెరగడంతో అమెరికా నుంచి 3వేల 800 మంది భారతీయులను బహిష్కరించారు. గత ఐదేళ్లలో ఇదే అత్యధిక సంఖ్య కావడం గమనార్హం. వీరిలో ఎక్కువమంది వాషింగ్టన్ డీసీ, హ్యూస్టన్ ప్రాంతాలకు చెందిన ప్రైవేట్ ఉద్యోగులే ఉన్నారని తేలింది.
►ALSO READ | ముంబై ఎన్నికల్లో గ్యాంగ్‌స్టర్ కుమార్తెలు.. బైకుల్లా నుంచి పోటీ...
మయన్మార్, కంబోడియా వంటి ఆగ్నేయాసియా దేశాల నుంచి జరుగుతున్న భారతీయుల డిపోర్టేషన్స్ భిన్నంగా ఉన్నాయి. అధిక జీతాలు ఇస్తామని నమ్మించి, భారతీయులను ఆయా దేశాలకు తీసుకెళ్లి సైబర్ క్రైమ్స్ చేసేందుకు బలవంతంగా వాడుకుంటున్నారని తేలింది. ఇలాంటి 'సైబర్ బానిసత్వం'లో చిక్కుకున్న వారిని అధికారులు గుర్తించి తిరిగి భారత్‌కు పంపిస్తున్నారు. మయన్మార్ నుంచి 1,591 మంది, కంబోడియా నుంచి 305 మంది భారతీయులు 2025లో వెనక్కి వచ్చారు.
చదువుల కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అత్యధికంగా బ్రిటన్ నుంచి 170 మంది విద్యార్థులు బహిష్కరణకు గురవ్వగా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా నుంచి 114, రష్యా నుంచి 82, అమెరికా నుంచి 45 ఇండియన్ స్టూడెంట్స్‌ని వెనక్కి పంపించేశాయి. విదేశాలకు వెళ్లేవారు అక్కడి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, సరైన ఏజెంట్లను ఎంచుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
