ముంబైకి చెందిన మాజీ గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అరుణ్ గావ్లి కుటుంబం మళ్ళీ రాజకీయాల్లో బిజీ అయ్యింది. అరుణ్ గావ్లి కుమార్తెలు గీతా గావ్లి, యోగితా గావ్లి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల కోసం శుక్రవారం నామినేషన్లు వేశారు. బైకుల్లా నుండి వీరు పోటీ చేస్తున్నారు.
గీతా గావ్లి గతంలో కార్పొరేటర్‌గా పనిచేశారు. ఇప్పుడు అఖిల భారతీయ సేన పార్టీ తరపున 212 వార్డు నుండి పోటీ చేస్తున్నారు.
గీత గావ్లి సోదరి యోగితా గావ్లి మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఆమె 207 వార్డు నుండి పోటీ చేస్తున్నారు.
సెంట్రల్ ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో గావ్లి కుటుంబానికి మంచి పట్టు ఉంది. గతంలో వీరి అత్త వందన గావ్లి కూడా ఇక్కడ కార్పొరేటర్‌గా గెలిచారు. అయితే, ఆమె ఇప్పుడు ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు.
ALSO READ : ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లెజెండ్స్
ముంబై ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 23న ప్రారంభమైంది. ఇప్పటివరకు చాలా తక్కువ మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. పెద్ద పార్టీలు ఇంకా అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది.
నామినేషన్లకు చివరి తేదీ డిసెంబర్ 30 కాగా.. BMC ఎన్నికల పోలింగ్ 15 జనవరి 2026న జరగనుంది. ఓట్ల లెక్కింపు 16 జనవరి 2026న జరుగుతుంది. గావ్లి సోదరీమణులు ఇద్దరూ పోటీలో ఉండటంతో బైకుల్లాలో ఈసారి ఎన్నికల పోరు చాలా ఆసక్తికరంగా మారనుంది.
