ఢిల్లీలో BMW బీభత్సం.. కేంద్ర ఆర్థిక శాఖ అధికారి స్పాట్ డెడ్.. పెద్ద ట్విస్ట్ ఏంటంటే..

ఢిల్లీలో BMW బీభత్సం.. కేంద్ర ఆర్థిక శాఖ అధికారి స్పాట్ డెడ్.. పెద్ద ట్విస్ట్ ఏంటంటే..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన బీఎండబ్ల్యూ యాక్సిడెంట్ కేసులో నిందితురాలు గగన్ ప్రీత్ను పోలీసులు సోమవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న నవజ్యోత్ సింగ్ అనే 57 ఏళ్ల ఉద్యోగి బైక్పై వెళుతుండగా బీఎండబ్ల్యూ కారు వేగంగా దూసుకొచ్చిన ఆయన బైక్ ను ఢీకొట్టింది. ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నవజోత్ సింగ్ తీవ్ర గాయాల పాలై మృతి చెందగా, ఆయన భార్యకు గాయాలయ్యాయి.

ఈ ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారును గగన్ ప్రీత్ అనే 38 ఏళ్ల మహిళ డ్రైవ్ చేయడం గమనార్హం. అయితే.. ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే.. ఇంత ఘోర ప్రమాదం జరిగితే దగ్గర్లోని హాస్పిటల్స్లో ఏదో ఒక హాస్పిటల్ కు తీసుకెళ్లకుండా ప్రమాదం జరిగిన ప్రాంతానికి 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న GTB Nagarలోని NuLife Hospitalకు తీసుకెళ్లాలని నిందితురాలు క్యాబ్ డ్రైవర్కు చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్వెస్టిగేషన్ను తప్పుదోవ పట్టించేందుకు నిందితురాలు ప్రయత్నం చేసి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గర్లో AIIMS, Army Base Hospital కూడా ఉన్నాయి. అయినా సరే.. 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కే బాధితులను చికిత్స నిమిత్తం తరలించడంపై బాధిత కుటుంబం తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసింది.

అంతేకాదు.. గగన్ ప్రీత్ కౌర్ తండ్రి NuLife Hospital కో-ఓనర్ కావడం గమనార్హం. తన తండ్రికి చెందిన హాస్పిటల్ అయితే ఈ కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసి ఈ కేసు నుంచి సులభంగా బయటపడొచ్చని  గగన్ ప్రీత్ కౌర్ భావించి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడి.. అప్పటికి చావుబతుకుల మధ్య ఉన్న తన తల్లిదండ్రులను 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కు ఎందుకు తరలించారని బాధితుడు నవజోత్ సింగ్ కొడుకు నిలదీశాడు. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన గగన్ ప్రీత్ ఆసుపత్రిలో చికిత్స పొందిన మరుసటి రోజు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

ఆమె భర్త పరీక్షిత్ మక్కడ్ (40) కూడా ఆ బీఎండబ్ల్యూ కారులో ఉండటంతో ఎఫ్ఐఆర్లో అతని పేరు కూడా నమోదు చేశారు. ఈ కారు ప్రమాదంలో చనిపోయిన నవజ్యోత్ సింగ్ తన కుటుంబంతో కలిసి గురుగ్రాంలో ఉండేవారు. ఆర్థిక శాఖలోని ఎకనమిక్ అఫైర్స్ విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న నవజోత్ సింగ్ మరణంపై కేంద్ర ఆర్థిక శాఖ ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బీఎండబ్ల్యూ కారు కూడా నుజ్జు నుజ్జయింది. అతి వేగం, ర్యా్ష్ డ్రైవింగ్ ఈ ఘోరానికి కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. బీఎండబ్ల్యూ కారు నంబర్ వచ్చేసి 0008.