
కొన్ని నెలల కిందట జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ దివంగతులైన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణంతో గుజరాత్ బీజేపీలోని అంతర్గత పోరుకు సంబంధించిన విషయాలు బయటపడ్డాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవం దక్కలేదని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన మరణం తర్వాత పార్టీలో జరిగిన విషయాలు ప్రస్తుతం గుజరాత్ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
దివంగత మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అంత్యక్రియల ఖర్చులను బీజేపీ పార్టీ చెల్లించటానికి నిరాకరించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన మరణం సమయంలో అయిన రూ.25లక్షల ఖర్చులను ఆయన కుటుంబం చెల్లించాల్సి రావటం రాజకీయ తుఫానుకు దారితీసింది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ రాజ్‌కోట్ పర్యటన సమయంలో దీనిపై అడిగిన ప్రశ్నకు బదులివ్వకుండా నిరాకరించటంతో వ్యవహారం వేడెక్కటం స్టార్ట్ అయ్యింది. అయితే దీని వెనుక సౌరాష్ట్ర వర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ALSO READ : టార్గెట్ హరీశ్, సంతోష్ ..
ఈ విషయంతో పార్టీలోని అంతర్గత చీలికల గురించి గుజరాత్ వ్యాప్తంగా పెద్ద చర్చ స్టార్ట్ అయ్యింది. జూన్ 16, 2025న రాజ్‌కోట్‌లో రూపానీ అంత్యక్రియల ఊరేగింపు జరిగిన మూడు నెలల తర్వాత ఈ వివాదం వెలుగులోకి రావటం గమనార్హం. రూపానీ అంత్యక్రియల సమయంలో వాడిన పువ్వులు, టెంట్స్, ఇతర ఏర్పాట్ల ఖర్చులు భరించాల్సిన బీజేపీ పార్టీ.. వాటి బాధ్యతను బాధలో ఉన్న రూపాణీ కుటుంబంపైకి నెట్టేసినట్లు వెల్లడైంది. బిల్లులు చెల్లించాలంటూ డబ్బు డిమాండ్ చేస్తూ వ్యాపారులు రూపానీ కుటుంబం దగ్గరకు వెళ్లటంతో అసలు విషయం బయటపడింది. దీంతో రూపానీ కుటుంబం ఆ అప్పులను తీర్చటం స్టార్ట్ చేశారు.
ఆదివారం నాడు రేస్‌కోర్స్ మైదానంలో జరిగిన 'నమోత్సవ్' కార్యక్రమానికి హాజరయ్యేందుకు పాటిల్ రాజ్‌కోట్‌కు వచ్చినప్పుడు ఈ వ్యవహారం బయటకు రావటం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. విలేకరులు అడిగిన ప్రశ్నకు తాను తర్వాత జవాబు ఇస్తానని అక్కడి నుంచి వెళ్లిపోయారు పాటిల్. ఈ పరిస్థితులపై కొందరు మాట్లాడుతూ ఇది గుజరాత్‌లో రాజకీయ మార్పులకు సంకేతం అని నమ్ముతున్నారు. మాజీ ముఖ్యమంత్రి అంత్యక్రియల పట్ల బీజేపీ వ్యవహరించిన తీరు పార్టీ పేరును మసకబారుస్తోంది. కీలకమైన ఎన్నికలకు ముందు ఇది పార్టీ ప్రతిష్టను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.