తిరుపతిలో శ్రీ మహా విష్ణువు విగ్రహంపై రచ్చ రచ్చ : ఏం జరిగింది.. ఎందుకీ వివాదం..?

తిరుపతిలో శ్రీ మహా విష్ణువు విగ్రహంపై రచ్చ రచ్చ : ఏం జరిగింది.. ఎందుకీ వివాదం..?

తిరుమలలో శ్రీమహా విష్ణువు విగ్రహంపై రచ్చ నెలకొంది. అలిపిరి పాదాల చెంత రోడ్డు పక్కన మద్యం బాటిళ్ల మధ్య శ్రీ మహా విష్ణువు విగ్రహం కలకలం రేపింది. టీటీడీ పాలకమండలి తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ పాలకమండలి, అధికార యంత్రాంగం హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు భూమన. ఈ ఘటనను హిందూ సంఘాలన్నీ వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని అన్నారు. టీటీడీ చైర్మెన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుసగా ఘోర అపచారాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన.

భూమన ఆరోపణలకు టీటీడీ బోర్డు కౌంటర్:

ఈ క్రమంలో టీటీడీ చైర్మెన్ క్యాంపు ఆఫీసులో బోర్డు సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ భూమన ఆరోపణలను తిప్పికొట్టారు టీటీడీ బోర్డు సభ్యులు. భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. భూమన కరుణాకర్ రెడ్డి అబద్దాలకు కేరాఫ్ అడ్రెస్ అని .. అబద్దపు, అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ...తిరుమల పవిత్రత టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు భాను ప్రకాష్.

అలిపిరి దగ్గర గతంలో ఒక ప్రవేటు శిల్పాల క్వార్టర్స్ ఉండేదని.. ఆ క్వార్టర్స్ పట్టు కన్నయ్య అనే శిల్పి నిర్వహించేవాడని అన్నారు. బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు శనీశ్వరుడు విగ్రహం ఆర్డర్ ఇచ్చారని.. శిల్పం తయారీలో లోపం రావడంతో ఆ రాతివిగ్రహం అక్కడ పడేసారని అన్నారు.గత పదేళ్లుగా ఆ విగ్రహం ఆ ప్రాంతంలోనే ఉందని.. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఆ విగ్రహాన్ని మహావిష్ణువు విగ్రహమని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అన్నారు భాను ప్రకాష్.

పక్కా ప్లాన్ ప్రకారం.. 

ప్రక్కా ప్లాన్ ప్రకారం ఆ విగ్రహం చుట్టుప్రక్కల నిన్న రాత్రి మద్యంసీసాలు పడేశారని..  పనిగట్టుకొని టీటీడీపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని అన్నారు.గతంలో శ్రీవారి ఆలయంలోని  రాములవారి ఉత్సవవిగ్రహానికి వేలు విరిగిపోయిందని.. భూమన మూడున్నర సంవత్సరాలు పట్టించుకున్న పాపానపోలేదని మండిపడ్డారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాములవారి విగ్రహానికి ఆగమశాస్త్రం ప్రకారం మరమ్మత్తు చేసామని వెల్లడించారు. స్వామివారి పట్ల ఇంత నిర్లక్ష్యం ఉన్న భూమన హిందుత్వం గురించి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు.

అసత్య ప్రచారాలు సహించం:

టీటీడీపై అసత్య ప్రచారాలు మానుకోకపోతే..కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు బోర్డు సభ్యులు. కరుణాకర్ రెడ్డి మాటలను, ఆరోపణలను నమ్మవద్దని భక్తులను కోరుతున్నామని అన్నారు. రాజకీయ ఉనికి కోసం, మీడియాలో కనిపించాలనే ఉద్దేశంతో భూమన కరుణాకర్ రెడ్డి దిగజారిపోయారని అన్నారు.టీటీడీ పై అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవడం చాలా దారుణమని.. భూమన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.