ఒకే కార్డుపై జర్నీ ఇంకెన్నడో..?.. కామన్​ మొబిలిటీ కార్డుకు ప్యాసింజర్ల ఎదురుచూపు

ఒకే కార్డుపై జర్నీ ఇంకెన్నడో..?.. కామన్​ మొబిలిటీ కార్డుకు ప్యాసింజర్ల ఎదురుచూపు
  • ఏండ్ల నుంచి ప్రతిపాదనలు ఉన్నా కార్యరూపం దాల్చట్లేదు
  • రోజురోజుకూ పబ్లిక్ట్రాన్స్​పోర్డుకు పెరుగుతున్న ప్రయారిటీ 
  • సిటీలో ప్యాసింజర్ల నుంచి అధికారులకు విజ్ఞప్తులు
  • మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీలో ఒకే కార్డుతో ఈజీ జర్నీ

హైదరాబాద్, వెలుగు: సిటీలో పబ్లిక్​ట్రాన్స్ పోర్ట్ ను వినియోగించుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆర్టీసీ, మెట్రోరైల్, ఎంఎంటీఎస్​ఇలా తమకు అందుబాటు ఉన్న సౌకర్యాన్ని ప్రస్తుతం వినియోగించుకుంటున్నారు. కానీ ప్రతి ప్రయాణానికి వేరుగా పాస్ ఉంటుండగా ఇబ్బందిగా మారింది.  దీంతో కామన్​మొబిలిటీ కార్డును తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఒకే కార్డుతో మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్​ ఇలా పబ్లిక్​ట్రాన్స్​పోర్టులో ప్రయాణించే వీలుంటుంది. స్టూడెంట్స్, ఉద్యోగుల నుంచి సీఎంసీకి డిమాండ్​పెరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్  కూడా కామన్ మొబిలిటీ కార్డు తెచ్చేందుకు    ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్​సంస్థలతో సమావేశాలు నిర్వహించారు. కానీ ఆ ప్రతిపాదనలు ఏండ్లుగా కార్యరూపంలోకి రావడంలేదు. 

భవిష్యత్ లో మరింత ప్రయారిటీ 

ఇప్పటికే మహాలక్ష్మి స్కీమ్​ద్వారా ఆర్టీసీలో ప్రయాణించేవారు పెరిగారు. మెట్రో, ఎంఎంటీఎస్​ల్లోనూ ప్యాసింజర్ల సంఖ్య అధికంగానే ఉంటుంది. సిటీలో ప్రస్తుతం ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్​లో కలిపి రోజుకు దాదాపు 25 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. అలాగే సిటీలో బస్సు సర్వీసులను కూడా ఆర్టీసీ పెంచుతోంది. మెట్రోను ఎంజీబీఎస్​నుంచి ఫలక్​నుమా వరకు విస్తరించేందుకు ఇటీవలే ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. దీంతో రాబోయే రోజుల్లో పబ్లిక్ ట్రాన్స్​పోర్టుకు మరింత ప్రయారిటీ పెరగనుంది. దీంతో కామన్ మొబిలిటీ కార్డును కూడా తేవాలని ప్రయాణికులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. సీఎంసీ ద్వారా పబ్లిక్​ట్రాన్స్​పోర్ట్ మాత్రమే కాదు. పార్కింగ్, షాపింగ్, ఆన్ లైన్ లావాదేవీలకు బ్యాంకు కార్డుగా వాడుకునే వీలు ఉంటుంది.

మహాలక్ష్మి కార్డు తెస్తామనగా..

ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్​ను అమలులోకి తీసుకొచ్చినప్పుడు మహిళా ప్రయాణికులకు ప్రత్యేకంగా ఒక కార్డును తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ప్రస్తుతం ఆధార్​కార్డుతోనే స్కీమ్​ను కొనసాగిస్తోంది. కామన్​మొబిలిటీ కార్డు తీసుకొస్తే మహాలక్ష్మి స్కీమ్​తో పాటు మిగతా ప్రయాణికులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఆ దిశగా ఆర్టీసీ అధికారులు ఆలోచన చేయాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.