
- పాస్టర్ చేతిలో నిండా మునిగిన బాధితులు, కలెక్టర్, ఎస్పీలకు కంప్లైంట్
- ఒక్కొక్కరి దగ్గర రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు
గద్వాల, వెలుగు: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసానికి పాల్పడిన ఘటన ధరూర్ మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో జాబ్ పేరుతో విజిట్ వీసాలు ఇచ్చి ధరూర్ లోని ఓ చర్చి పాస్టర్ బురిడీ కొట్టించాడు. 42 మంది బాధితులు ఉండగా, ఒక్కొక్కరి దగ్గర రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షలు వసూలు చేసి దగా చేశాడు. 10 రోజులుగా చర్చిలో ఆం దోళన చేస్తున్న బాధితులు సోమవారం ఎస్పీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు.
మూడు రాష్ట్రాల్లో మోసం..
ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో పాస్టర్ మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఏపీలోని కోనసీమ జిల్లా నకిరేటిపల్లి మండలానికి చెందిన బాధితులు మాత్రమే కంప్లైంట్ చేశారు. ఇజ్రాయిల్, అబుదాబి తదితర ప్రాంతాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేశాడు. కొందరికి విజిట్ వీసాలు ఇచ్చి ఇజ్రాయిల్‌కు పంపించగా, టూరిస్ట్ వీసా గడువు తీరిన తరువాత అక్కడి ప్రభుత్వం వారిని తిప్పి పంపించింది. టూరిస్ట్ వీసాలతో మోసం చేసిన పాస్టర్ కోసం గత ఏడాది నుంచి 42 మంది బాధితులు తిరుగుతూనే ఉన్నారు.
ఇప్పటికే పాస్టర్ పై కేసులు..
ధరూర్ లోని ఓ చర్చి పాస్టర్ పై ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. విజయవాడ, బళ్లారి, ఏపీలోని నకిరేకల్ తదితర ప్రాంతాల్లో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. విదేశాలకు పంపిస్తానని వసూలు చేసిన డబ్బులతో జల్సాలు చేస్తూ, కార్లు కొనేవాడని చెబుతున్నారు. చర్చిలో ఉండకుండా బిజినెస్ పేరుతో తిరిగేవాడని, ఆయనతో వేగలేక ఆ పాస్టర్ తమకు వద్దని మూడు వారాలుగా ధరూర్ చర్చిలో రభస జరుగుతోంది.
విజిట్ వీసాలతో వెళ్లాక అక్కడ ఉద్యోగం వస్తుందని పాస్టర్ సుదర్శన్ అలియాస్ అబ్రహం నమ్మించాడని బాధితులు బాలకృష్ణ, ప్రసాద్, చిట్టిబాబు, ప్రభుదాస్, భారతి, సునీల్, రత్నకుమారి, బేబీ, కిశోర్, విజయ్, మోహన్, పద్మ వాపోయారు. ఉద్యోగం వస్తుందని ప్లాట్లు, పొలాలు అమ్ముకొని డబ్బులు ఇచ్చామని చెప్పారు. విజిట్ వీసాలపై 2024 జూన్ 9న వెళ్లిన తాము అతి కష్టం మీద తిరిగి వచ్చామని, తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. డబ్బులు ఇచ్చేది లేదని దౌర్జన్యం చేస్తున్నాడని, దీంతో కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశామని తెలిపారు.