- కట్టిన మూడేళ్లకే కుప్ప కూలిన బ్రిడ్జి
- వాగు ప్రవహిస్తే 8 గ్రామాలకు రాకపోకలు బంద్
- అటవీ అనుమతి లేక ఆగిపోయిన దొత్తి వాగు బ్రిడ్జి నిర్మాణం
- వర్షాకాలం వస్తుండడంతో భయపడుతున్న ప్రజలు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని రెండు వాగులపై బ్రిడ్జిలు లేకపోవడంతో వాగుల అవతల ఉన్న 15 గ్రామాల గిరిజనుల తిప్పలు తీరడంలేదు. వర్షాకాలం వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. పెంబి మండలంలోని పసుపుల వాగు, దుత్తి వాగుల అవతల 15 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఇక్కడి గ్రామస్తులు మరో ఊరికి వెళ్లాలంటే ఈ రెండు వాగులను దాటాల్సిందే. అయితే వర్షాకాలంలో ఈ వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో వేరే ప్రాంతాలకు రాకపోకలన్నీ నిలిచిపోతున్నాయి. ప్రతి ఏటా వారిది ఇదే పరిస్థితి. బ్రిడ్జిలు నిర్మించి తమ సమస్య తీర్చాలని అధికారులు, నేతలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని కుంటాల, పొచెర జలపాతాల నుంచి ప్రవహించే కడెం నది పెంబి మండలంలోని పసుపుల గ్రామం, హరిచంద్ తండా, నాయక్ గూడా, తులసిపేట, దయ్యాల మద్ది, కర్ణం లొద్ది, కొరకంటి తండా గుండా ప్రవహిస్తుంది. కాగా పసుపులలో 2019లో వంతెనను నిర్మించారు. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో దాదాపు రూ.5.50 కోట్లతో చేపట్టిన పనుల్లో నాణ్యత పాటించకపోవడం, వరద ప్రవాహానికి 2021లో ఈ బ్రిడ్జి కొట్టుకుపోయింది. డిజైన్ లోపం కారణంగానే బ్రిడ్జి కొట్టుకుపోయిందని విచారణ అధికారులు గుర్తించారు. అయితే పూర్తిగా కొట్టుకుపోయిన ఈ బ్రిడ్జిని ఐదేండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు పునర్నిర్మించలేదు.
ఈ వంతెన పైనుంచి 8 గిరిజన గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తారు. ఏటా వాగు ప్రవాహించిన ప్రతిసారి ఆయా గ్రామాల ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. కొట్టుకుపోయిన వంతెనను పునర్నిర్మించాలని కోరుతూ ఆయా గ్రామాల గిరిజనులు అనేకసార్లు ఆందోళనలు చేసినప్పటికీ వారి గోడును ఎవరూ పట్టించుకోవడం లేదు.
అటవీ అనుమతులు లేక..
ఆర్అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో దొత్తి వాగుపై బ్రిడ్జి నిర్మించేందుకు రూ.4 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. అయితే ఈ వాగు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉండడంతో ఆ శాఖ అధికారులు కొర్రీలు పెడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం కోసం అనేకసార్లు దరఖాస్తులు చేసినప్పటికీ అనుమతులు మాత్రం జారీ చేయడం లేదు. అటవీ శాఖ అనుమతుల కోసం జిల్లా ఉన్నతాధికారులు సైతం పలుసార్లు సమీక్షలు జరిపినప్పటికీ ఫలితం కనిపించడం లేదు.
దీంతో యాపల్ గూడ, గోండుగూడ, రాంనగర్, సత్తుగూడ, చాకిరేవు, రాము గూడ, రాంనగర్ తండా వాసుల రాకపోకలకు తిప్పలు తప్పడంలేదు. ఇకనైనా ఈ బ్రిడ్జిలను నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
వర్షాకాలం వస్తుందంటే భయమైతుంది
దొంతివాగుపై బ్రిడ్జి లేకపోవడంతో వర్షాకాలంలో ఎటూ వెళ్లలేకపోతున్నం. వరద కారణంగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నం. సమస్యను అధికారులు, నేతలకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా వాగుపై బ్రిడ్జి కట్టి మా సమస్యను పరిష్కరించాలి.-
భీంరావు, చాకిరేవు గ్రామం, పెంబి మండలం
