Pat Cummins: కోహ్లీ, రోహిత్ కంబ్యాక్ సిరీస్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ దూరం.. యాషెస్‌కు డౌట్

Pat Cummins: కోహ్లీ, రోహిత్ కంబ్యాక్ సిరీస్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ దూరం.. యాషెస్‌కు డౌట్

ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ పాట్ కమ్మిన్స్ గాయం కారణంగా న్యూజిలాండ్, ఇండియాతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరమయ్యాడు. కమ్మిన్స్ దూరమవుతున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం (సెప్టెంబర్ 2) ధృవీకరించింది. ఈ నెలలో న్యూజిలాండ్ .. అక్టోబర్ 19 నుంచి ఇండియాపై వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. ఆసీస్ తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కు టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడనున్నారు. ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోకో జోడీ ఎనిమిది నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్నారు. 

ఈ మెగా సిరీస్ కు కమ్మిన్స్ దూరం కావడం క్రికెట్ ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేస్తోంది. ఆస్ట్రేలియా వన్డే, టెస్ట్ కెప్టెన్ కమ్మిన్స్ ప్రస్తుతం వెన్ను గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. నవంబర్ నుంచి సొంతగడ్డపై జరగబోయే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కు అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఒకవేళ కమ్మిన్స్ దూరమైతే వన్డేల్లో అతని స్థానంలో మిచెల్ మార్ష్.. టెస్టుల్లో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ తర్వాత వెస్టిండీస్ తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను కమ్మిన్స్ ఆడాడు.

ఆ తర్వాత పని భారం కారణంగా క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు.ఈ క్రమంలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. కివీస్ తో సిరీస్ సమయానికి అందుబాటులో ఉంటాడని భావించినా గాయం కమ్మిన్స్ పునరాగమనం కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పేలా లేదు. నవంబర్ 21 నుంచి యాషెస్ స్టార్ట్ అవుతుంది. సొంతగడ్డపై జరగబోయే ఈ టెస్ట్ సిరీస్ ను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా ఉంది. మరోవైపు అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో వైట్ బాల్ ఫార్మాట్ ప్రారంభమవుతుంది.

2020 తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది.