
- ఇయ్యకుంటే రాజీనామా
- బీఆర్ఎస్ హైకమాండ్‌కు నీలం మధు అల్టిమేటం
పటాన్ చెరు, వెలుగు : పటాన్ చెరు బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ నీలం మధు అధికార పార్టీకి రాజీనామా అస్త్రాన్ని సంధించారు. ఈనెల 16వ తేదీలోగా టికెట్ విషయమై బీఆర్ఎస్ హైకమాండ్ ఏదో ఒకటి తేల్చాలని, లేదంటే ప్రజల సమక్షంలో పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని అల్టిమేట్టం ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం చిట్కుల్ గ్రామంలో ఎన్ఎంఆర్ యువసేనతో పాటు అనుచరులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాకు తన రాజకీయ భవిష్యత్ గురించి వివరించారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై ప్రజల గొంతుకగా ఇంటింటికి తిరిగి వారి సమస్యలు తెలుసుకుంటానన్నారు.
పార్టీకి రాజీనామా చేశాక విజయదశమి సందర్భంగా దేవీ నవరాత్రుల నుంచి తన కార్యాచరణ కొసాగిస్తానన్నారు. గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి గ్రామ బూత్ స్థాయి నుంచి తన పాదయాత్ర మొదలు పెడతానని తెలిపారు. గడప గడపకు తిరుగుతూ సమస్యలను తెలుసుకోవడంతో పాటు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తానని మధు వెల్లడించారు.
ప్రతి కుటుంబంలో ఒక బిడ్డగా మారి వారి యోగక్షేమాలు పర్యవేక్షిస్తానన్నారు. రాష్ట్రంలో 60 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ లో న్యాయం జరగడం లేదన్నారు. పటాన్ చెరులో 80 శాతం బీసీ ఓటర్లు ఉండగా వారి మద్దతుతో కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని ధీమా వ్యక్తం చేశారు.