సిలిండర్ల కొరత సాకుతో పేషెంట్ల ఫుడ్లో కోత

సిలిండర్ల కొరత సాకుతో పేషెంట్ల ఫుడ్లో కోత
  • గ్యాస్​ సిలిండర్ల కొరతంటూ పేషెంట్ల అందించే ఫుడ్​లో కోత 
  • భద్రాద్రికొత్తగూడెం జీజీహెచ్​లో మెనూకు తిలోదకాలు 
  • కాంట్రాక్టర్​ నిర్లక్ష్యం., అధికారుల పర్యవేక్షణ కరువు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రోగం నయం చేసుకోవడానికి ఆస్పత్రిలో చేరిన రోగులకు ఇచ్చే ఫుడ్​కు కోత పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ జనరల్​ ఆస్పత్రిలో గ్యాస్​ సిలెండర్ల కొరత అంటూ పేషెంట్లకు మెనూ ప్రకారం పౌష్టికాహారం ఇవ్వడం లేదు. గ్యాస్​ కొరత సాకుతో ఆస్పత్రి క్యాంటిన్​ కాంట్రాక్టర్​ మెనూతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు ఇ న్​పేషెంట్లకు ఆహారం అందిస్తున్నాడు. ఆస్పత్రి ఆఫీసర్లు, సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం కూడా ఇందుకు కారణం. డైటీషియన్, న్యూట్రీషియన్ పోస్టులు ఖాళీగా ఉండడంతో కాంట్రాక్టర్​దే ఇష్టారాజ్యంగా మారింది. 

పేషెంట్లకు నామమాత్రపు ఫుడ్.. 

భద్రాద్రికొత్తగూడెం జీజీహెచ్​లో నిత్యం వందలాది రోగులు ఇన్ పేషెంట్లుగా ఉంటూ ట్రీట్​మెంట్స్ తీసుకుంటున్నారు. ఇన్ పేషెంట్లుగా ఉన్న వారికి ఆస్పత్రిలోని క్యాంటీన్​ నుంచి ఫుడ్​ అందిస్తారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్య సిబ్బంది మెనూను కాంట్రాక్టర్​కు సూచిస్తారు. ఆ ప్రకారమే రోగులకు ఫుడ్​ అందించాల్సి ఉంది. కాగా, సిలిండర్ల కొరతంటూ రెండు, మూడు రోజులుగా కాంట్రాక్టర్​ ఫుడ్​లో కోత పెట్టారు.

పలువురు రోగులకు కోడి గుడ్డును ఇవ్వడం లేదు. సాంబర్, పప్పు అందివ్వడం లేదు. అన్నం, అరటిపండుతో పాటు నీళ్లవంటి మజ్జిగ, కూర మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. తమ కళ్ల ముందే నామమాత్రపు ఫుడ్​ను అందిస్తున్నప్పటికీ వైద్యులు, సిబ్బంది తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు  వస్తున్నాయి. 

న్యూట్రీషియన్, డైటీషియన్ పోస్టులు ఖాళీ.. 

జీజీహెచ్​లో న్యూట్రీషియన్​తో పాటు డైటీషియన్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఇన్ పేషెంట్లకు అందించే ఫుడ్​క్వాలిటీ, మెనూ అమలు తీరును పర్యవేక్షించే వారే కరవయ్యారు. నర్సింగ్ సూపరింటెండెంట్​తో పాటు ఆర్ఎంవో, ఏడీ కనీసం పర్యవేక్షించకపోవడంతో పౌష్టికాహారం రోగులకు అందడం లేదు. 

మెనూ అమలు చేయాల్సిందే..

మెనూ ప్రకారం ఇన్ పేషంట్​రోగులకు ఫుడ్డును అందించాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ దే. గ్యాస్ సిలిండర్లు లేవంటూ ఫుడ్​లో కోత పెట్టడం కూడదు. మెనూ పక్కాగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. రోగులకు పౌష్టికాహారం అందించే విధంగా కాంట్రాక్టర్​ను ఆదేశిస్తాం. -డాక్టర్ రమేశ్, ఆర్ఎంవో, భద్రాద్రికొత్తగూడెం జీజీహెచ్​