నెలన్నర గడిచినా సేవలు నిల్​

నెలన్నర గడిచినా సేవలు నిల్​
  • నెలన్నర గడిచినా సేవలు నిల్​
  •  మేలో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించిన  మంత్రి హరీశ్​రావు
  •  ఎక్విప్​మెంట్స్, సిబ్బంది​ లేక  పాత బిల్డింగ్​లోనే రోగులు
  •  తీవ్ర అవస్థలు పడుతున్న గర్భిణులు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 100 పడకలతో మాతాశిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)​ప్రారంభోత్సవం జరిగి నెలన్నర గడిచినా సేవలు అందకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మే 4వ తేదీన వైద్య శాఖ మంత్రి హరీశ్​రావు ఎంసీహెచ్ ను ఓపెన్ చేశారు. అయితే బిల్డింగ్ ఇంటర్నల్ పనులు పూర్తి కాకపోవడంతో ఓపెనింగ్ టైంకు ఎంసీహెచ్ ను కాంట్రాక్టర్ నుంచి జిల్లా వైద్యశాఖ హ్యాండోవర్ చేసుకోలేదు. అలాగే ఎలాంటి మెడికల్ ఎక్విప్​మెంట్, కావాల్సినంత సిబ్బంది లేకుండానే మంత్రితో ఆస్పత్రిని ఓపెన్​ చేయించారు. అనంతరం విషయం తెలిసిన మంత్రి స్థానిక నేతలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో వారం, పది రోజుల్లో ఎంసీహెచ్​కి కావాల్సిన అన్నిరకాల వస్తువులు సమకూర్చుతామని హామీ ఇచ్చారు. అలాగే మంథనిలో ఎంసీహెచ్​పరిస్థితి కూడా ఇలాగే ఉందని తెలుసుకుని అప్పటికప్పుడే ఓపెనింగ్​ను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే దాదాపు 45 రోజులు అవుతున్నా పెద్దపల్లి ఎంసీహెచ్ ను పేషెంట్లకు అందుబాటులోకి తీసుకురాలేదు. మంత్రి చెప్పినట్లుగా వారంలో కావాల్సిన ఎక్విప్​మెంట్​కూడా రాలేదు.

ఇరుకు గదుల్లో ఇబ్బందులు..

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రూ.17 కోట్లతో 100 పడకల ఎంసీహెచ్​ని అన్ని హంగులతో నిర్మించారు. మంత్రి ప్రారంభోత్సవం చేసి  45 రోజులు గడిచినా ఇప్పటికీ పేషెంట్లకు అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో పాత ఆస్పత్రిలోనే ఇరుకు గదుల్లో గర్భిణులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కొత్త ఆస్పత్రిలో సేవల ప్రారంభంపై అధికారులు స్పందించడం లేదు. కాగా ఎంసీహెచ్ ఓపెనింగ్స్ ద్వారా మంథని నియోజకవర్గ ఇన్​చార్జి, జడ్పీ చైర్మన్​ పుట్ట మధు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని, అయితే ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయని పలువురు విమర్శిస్తున్నారు. అలాగే జడ్పీ చైర్మన్​మధు జూన్​12న మరోసారి మంథని ఎంసీహెచ్ ఓపెనింగ్​కు మంత్రి హరీశ్​రావును ఆహ్వానించారు. షెడ్యూల్ కూడా ప్రకటించారు. అయితే ఆ రాత్రికే షెడ్యూల్ క్యాన్సిల్ చేశారు. తొందరపాటు చర్యలతో ప్రజల్లో చులకనవుతున్నామని భావించే మంథని ప్రోగ్రాం మరోసారి రద్దు చేసుకున్నట్లు తెలిసింది. 

గర్భిణులకు తప్పని తిప్పలు..

ఎంసీహెచ్ ను ప్రారంభించినపుడు ఆస్పత్రి అందుబాటులోకి వచ్చిందని ప్రజలు సంతోషించారు. అయితే వారి సంతోషం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. పేరుకే ఓపెన్ చేశారు కానీ గర్భిణులకు అందుబాటులోకి తేలేకపోయారు. దీంతో పాత ఆస్పత్రుల్లోనే గర్భిణులు అసౌకర్యాల నడుమ పరీక్షలు చేయించుకుంటున్నారు. కనీసం కూర్చోవడానికి కుర్జీలు కూడా లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. గర్భిణులు చాలా  పరీక్షల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తుంది. దీనికి తోడు సమీప గ్రామాల్లోని గర్భిణులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో కావాల్సిన సేవలు అందటం లేదు. ఆస్పత్రిలో గైనకాలజిస్టులు ఐదుగురు కావాల్సి ఉండగా ఇద్దరే ఉండటంతో హాస్పిటల్​కు వచ్చిన గర్భిణులు గంటల తరబడి లైన్​లో నిలబడాల్సి వస్తుంది. ఎంసీహెచ్​ అందుబాటులోకి వస్తే ఈ ఇబ్బందులు తప్పేవని పేషెంట్ల, డాక్టర్లు అంటున్నారు.