ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రుల్లో వసూళ్ల దందా

ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రుల్లో వసూళ్ల దందా

ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటళ్లలో వసూళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. హాస్పిటల్ గేటు నుంచి మొదలు పెడితే వాష్ రూంల క్లీనింగ్ వరకూ పైసా లేనిదే పనికావడం లేదని రోగులు అంటున్నారు. చేయి తడిపితేనే పనులని ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు తెగేసి చెబుతున్నారని అంటున్నారు. దీంతో చేసేది లేక డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకోవడం లేదని రోగులు చెప్తున్నారు.

ఏళ్ల తరబడి వసూళ్ల దందా

ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్స్ కు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రైవేట్ లో డెలివరీలు, పీడీయాట్రిక్ ట్రీట్మెంట్ కు లక్షల రూపాయలు ఖర్చుచేయలేక పేద, మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్స్ కు వస్తున్నారు. అయితే సిటీలోని నీలోఫర్, కోఠి మెటర్నిటీ, పేట్ల బురుజు మెటర్నిటీ హస్పిటల్స్ తో పాటు ఏరియా హాస్పిటల్స్ లలో ఏళ్ల తరబడి వసూళ్ల దందా కొనసాగుతోంది.

డ్రెస్సింగ్ చేయాలన్నా, సెలైన్ పెట్టాలన్నా..

కొడుకు పుడితే ఇంత, కూతురు పుడితే అంత అంటూ వసూల్ చేస్తున్నారు. డ్రెస్సింగ్ చేయాలన్నా, సెలైన్ పెట్టాలన్నా.. వాష్ రూం క్లీన్ చేయాలన్నా డబ్బులు ఇస్తేనే చేస్తున్నారని రోగులు చెబుతున్నారు. హాస్పిటల్ లోపలికి అనుమతించాలంటే.. అంతో ఇంతో సెక్యూరిటీ చేయి తడపాలి. ఇక స్ట్రెచర్, వీల్ చైర్ పట్టుకోవాలన్నా.. వందో, రెండు వందలో ఇవ్వాలి. 50, వంద నుంచి మొదలు పెడితే పరిస్థితిని చూసి వెయ్యి వరకూ వసూల్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. డెలివరీ కోసం వెళితే.. వీరికి ఇచ్చేందుకే ఐదారు వేల వరకు అవుతున్నాయంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైసలు ఇవ్వకపోతే హాస్పిటల్ కు ఎందుకొస్తున్నారని సిబ్బంది దబాయిస్తున్నారని రోగులు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో సెక్యూరిటీలు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా హాస్పిటళ్లలో తీరు మారడం లేదంటున్నారు.

డబ్బులివ్వాలని ఇబ్బంది పెడుతున్నారు

ప్రైవేట్ ఆసుపత్రిలో వేలకు వేలు డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోలేక ప్రభుత్వ హాస్పిటల్స్ కు వస్తుంటే.. ఇక్కడ మాత్రం తమను డబ్బులివ్వాలని ఇబ్బంది పెడుతున్నారని రోగుల బంధువులు అంటున్నారు. నీలోఫర్ హాస్పిటల్లో ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు వసూల్ చేసే డబ్బుల్లో ఓ పిడియాట్రిక్ డాక్టర్ కు వాటా ఉందనే విమర్శలున్నాయి. ఫోర్త్ క్లాస్ ఉద్యోగి ఒకరు.. నెలకు 30 లక్షల వరకూ వసూల్ చేసి అందులో 50 శాతం ఓ డాక్టర్ కు ఇస్తున్నాడని హాస్పిటల్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మంత్రి హెచ్చరించినా మార్పు లేదు

కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచినా పేషంట్ల నుంచి మాత్రం వసూళ్లు ఆగడం లేదు. రీసెంట్ గా పేట్ల బురుజు మెటర్నిటీ హాస్పిటల్లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ కొందరు ఫోర్త్ క్లాస్ ఉద్యోగుల కారణంగా మొత్తం హాస్పిటల్స్ కే చెడ్డ పేరు వస్తోందని చెప్పారు. పేషంట్ల నుంచి డబ్బులు డిమాండ్ చేసినా.. వసూలు చేసినా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించినా పరిస్థితి మార్పు రావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు హాస్పిటళ్లలో వసూళ్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలని రోగులు అంటున్నారు.