సీజనల్ జ్వరాలు..ఎంజీఎంకు క్యూ కట్టిన బాధితులు

సీజనల్ జ్వరాలు..ఎంజీఎంకు క్యూ కట్టిన బాధితులు
  • సీజనల్​ జ్వరాలతో తెల్లవారుజామునే మొదలవుతున్న క్యూలు​
  • సాధారణ రోజుల్లో కంటే రోగుల సంఖ్య డబుల్​  
  • ముందు డాక్టర్ల కోసం..తర్వాత మందుల కోసం 
  • గంటల తరబడి లైన్లలోనే  
  • సగం మందులు దొర్కుతలేవ్​  


వరంగల్‍, వెలుగు : వానాకాలం మొదలవడంతో జ్వరాలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో వరంగల్‍ ఎంజీఎం హాస్పిటల్‍ కు తెల్లవారుజాము నుంచే పేషెంట్లు క్యూ కడుతున్నారు. డాక్టర్ల కు చూపించుకోవడానికి బారులు తీరుతున్నారు. దీంతో ఓపీ సంఖ్య రెట్టింపయ్యింది. రద్దీకి అనుగుణంగా డాక్టర్లు, సిబ్బంది లేకపోవడంతో చికిత్స అందించడంలో ఆలస్యమవుతోంది. దీంతో జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నవారు గంటల తరబడి లైన్లలో నిల్చోలేక గోస పడుతున్నారు. తీరా డాక్టర్లు చెక్​ చేసిన తర్వాత రాసే మందులు హాస్పిటల్ ​ఫార్మసీలో దొరకడంలేదు. అక్కడుండే స్టాఫ్‍ బయట మెడికల్‍ షాపుల్లో కొనుక్కోండని చెప్పి పంపిస్తున్నారు.  

రోజూ 4 వేలకు పైనే.. 

నిన్న మొన్నటి వరకు ఎంజీఎం హాస్పిటల్‍ కు 2 వేల నుంచి 2500 వరకు రోగులు వచ్చేవారు. సోమవారాల్లో ఓపీ ఒక్కోసారి 3వేల వరకు వెళ్లేది. వారం నుంచి వర్షాలు పడుతుండడంతో జ్వరాలతో వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఐదు రోజుల నుంచి ప్రతిరోజూ 4 వేల మంది వస్తున్నారు. గురువారం 4,420 మంది పేషెంట్లు వచ్చారు.  

ఉన్న డాక్టర్లపై భారం..మందుల్లేవు..

ఓపీ పెరిగిన నేపథ్యంలో అధికారులు ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బందితోనే నడిపిస్తున్నారు. పేషెంట్ల సంఖ్య ఎక్కువ కావడంతో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు చూడాల్సిన డాక్టర్లు మధ్యాహ్నం 2 గంటల వరకు చూస్తున్నారు. డాక్టర్ల సంఖ్య పెంచితే ఉన్న డాక్టర్లపై భారం తగ్గే అవకాశం ఉంటుంది. మరోవైపు మందుల కొరత కూడా వేధిస్తోంది. ప్రధానంగా పారాసెటమాల్‍, యాంటీబయాటిక్స్, యాంటీ అలర్జీ, బీ కాంప్లెక్స్, పెయిన్‍ కిల్లర్స్​దొరకడం లేదు. దీంతో సగం మందులు దవాఖానాలో..సగం మందులు ప్రైవేట్​ మెడికల్ స్టోర్స్​లో తీసుకోవాల్సి వస్తోంది. మరికొంతమందికి వారం రోజులకు ఇవ్వాల్సిన మెడిసిన్​ను రెండు, మూడు రోజులకే ఇచ్చి పంపిస్తున్నారు. ఆ మందులు అయిపోయిన తర్వాత మళ్లీ ఎంజీఎం బాట పట్టాల్సి వస్తున్నది. ఎంజీఎంకు ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు సీఎంఎస్‍ (సెంట్రల్‍ మెడికల్‍ స్టోర్‍) నుంచి మందులు వస్తుంటాయి. సీఎంఎస్​కు ప్రతి మూడు నెలలకోసారి సర్కారు బడ్జెట్ ​ఇస్తుంది. ప్రస్తుతం ఫీవర్‍ సీజన్‍ నేపథ్యంలో పేషెంట్ల సంఖ్య పెరిగి మందుల అవసరం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో మూడు నెలల ​కాలాన్ని తగ్గించి బడ్జెట్ మరింత ​పెంచాలని పలువురు కోరుతున్నారు.  

విపక్షాలు ఆందోళన చేసినా...

ఎంజీఎం హాస్పిటల్​లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్‍, బీజేపీలు ఆందోళనలకు దిగినా స్పందన కనిపించడం లేదు. గత నెల బీజేపీ, ఈనెల 21న కాంగ్రెస్‍ లీడర్లు ఎంజీఎం పరిశీలనకు వచ్చారు. హాస్పిటల్​లో రోగులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పేషెంట్లు నడవలేని స్థితిలో వస్తే కనీసం వీల్‍ చైర్‍ లో తీసుకువెళ్లేవారు లేరని మండిపడ్డారు. మందులు, ఐవీ సెట్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ టైంలో ఎక్స్​రే కూడా తీయడం లేదన్నారు. మెడికల్‍ స్టాఫ్‍ ను హస్పిటల్‍ నిద్ర చేయాలని చెబుతున్న మంత్రి హరీశ్​రావు ఎంజీఎంలో నిద్ర చేసి సమస్యలేంటో తెలుసుకోవాలని కోరారు. 15 రోజుల్లో ఎంజీఎం సమస్యలు పరిష్కరించకపోతే మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లముందు చావు డప్పు కొడతామని కాంగ్రెస్​ లీడర్లు హెచ్చరించారు.  

మందుల కొరత నిజమే...

హాస్పిటల్​లో అందుబాటులో ఉన్న డాక్టర్లతో బెస్ట్​ ట్రీట్​మెంట్​ ఇస్తున్నం. గతంలో ఓపీ సంఖ్య తక్కువగా ఉండేది కాబట్టి సమస్య ఉండేది కాదు. వానాకాలం సీజన్​లో జ్వరాలు వస్తుండడంతో పేషెంట్ల సంఖ్య పెరిగింది. రోజూ 9 గంటల నుంచి 12 గంటల వరకు చూసేవాళ్లం. రద్దీ పెరడగంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు చూస్తున్నాం. మందుల కొరత ఉన్న మాట వాస్తవమే. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం.
 – డాక్టర్‍ చంద్రశేఖర్‍, సూపరింటెండెంట్‍

మస్తు టైం పడుతంది  

జ్వరం, కడుపునొప్పితో ఎంజీఎంకు వచ్చిన. 9 గంటలకు డాక్టర్లు వస్తరని చెప్తే ఏడున్నరకే వచ్చినా. 12 గంటలు దాటినా రాలే. అసలే పానం బాగాలేదు. సాతనైతలేదు.. ఇంతసేపు లైన్​లో నిలవడాలంటే ఎట్లా..?  మరింత మంది డాక్టర్లను పెంచి మాలాంటోళ్ల పేషెంట్ల బాధలు తప్పించాలె. 

– నర్సయ్య, వరంగల్  

సగం మందులు దొరకలే 

ఆరోగ్యం మంచిగ లేదని సూపెట్టుకుందామని వచ్చినా. డాక్టర్లు పరీక్షలు చేయనీకి మూడు గంటలు పట్టింది. సార్ టెస్టులు రాసిండు. రిపోర్టులు వచ్చే వరకు మందులు వేసుకోవాలని చిట్టీ రాసిచ్చిండు. అందులో సగం కూడా ఇయ్యలే. బయట షాపుల్లో తీసుకోమని చెప్పిన్రు.  ప్రైవేటులో కొననీకి పైసలెక్కడున్నయ్​. 
– తులసి, గోదావరిఖని