ఆపరేషన్ వాయిదాలు వేస్తుండడంతో పోలీసులకు పేషెంట్ భర్త ఫిర్యాదు

ఆపరేషన్ వాయిదాలు వేస్తుండడంతో  పోలీసులకు పేషెంట్ భర్త ఫిర్యాదు
  • ఆపరేషన్​ థియేటర్ కు తీసుకువెళ్లి  సర్జరీ చేయలే.. 
  • కిడ్నీ ఆపరేషన్‍ కోసం  45 రోజులుగా ఎదురుచూపులు 
  • షుగర్‍ లెవెల్స్​పెరగడం వల్లే ఆపామని వివరణ 

వరంగల్‍, వరంగల్‍ సిటీ, వెలుగు: 'మేం ఆపరేషన్‍ చెయ్యం.. వెళ్లి పోలీసులతో చేయించుకో' అంటూ డాక్టర్లు కిడ్నీనొప్పితో బాధపడుతున్న ఓ పెషెంట్​సర్జరీ ఆపారు. ఈ ఘటన శుక్రవారం వరంగల్‍ కేఎంసీలోని సూపర్‍ స్పెషాలిటీ హస్పిటల్​లో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఉల్లిగడ్డ దామెరకు చెందిన దామెర జయ(35) కిడ్నీ నొప్పితో అక్టోబర్‍ 4న కేఎంసీ సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍ కు వచ్చింది.

ఆపరేషన్‍ అవసరమంటూ సిబ్బంది ఆమెను అడ్మిట్‍ చేసుకున్నారు. రేపుమాపంటూ 15 రోజుల పాటు ఉంచారు. ఆపై బెడ్లు ఖాళీ లేవంటూ నాలుగు రోజులు ఇంటికి పంపారు. నవంబర్‍ రెండో వారంలో మళ్లీ వచ్చి అడ్మిట్‍ అయ్యారు. అప్పటి నుంచి గురువారం వరకు ఆపరేషన్‍ చేయలేదు. ఇదే విషయమై బంధువులు అడగడంతో శుక్రవారం ఉదయం చేస్తామని చెప్పారు. ఆపరేషన్‍ సమయంలో అవసరమవుతుందని బ్లడ్‍ గ్రూప్‍ వివరాలను ఆమె భర్త అశోక్‍ కు ఇచ్చారు.

దీంతో ఆయన ఎంజీఎం బ్లడ్‍ బ్యాంక్‍ కు వెళ్లి రక్తం తీసుకుని వచ్చాడు. అయితే రక్తం కేవలం రిజర్వ్​చేసుకోమంటే ఎందుకు తెచ్చావంటూ డాక్టర్లు సీరియస్‍ అయ్యారు. దానిని తిరిగి ఇచ్చి శుక్రవారం ఉదయం తీసుకురావాలని చెప్పారు. అశోక్‍ రక్తం ప్యాకెట్లతో బ్లడ్‍ బ్యాంక్‍ కు వెళ్తే సిబ్బంది తీసుకోలేదు సరికదా తెల్లారి మరోసారి రక్తం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. దీంతో మనోవేదనకు గురైన అశోక్‍ స్థానిక మట్టెవాడ పోలీస్‍ స్టేషన్‍ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. 

ఖాళీ కడుపుతో.. 18 గంటల నరకం

డాక్టర్ల తీరుపై ఫిర్యాదు రావడంతో అక్కడున్న ఇన్​స్పెక్టర్​రమేశ్​హాస్పిటల్‍ అధికారులతో మాట్లాడారు. దీంతో శుక్రవారం ఉదయం జయకు ఆపరేషన్‍ చేయడానికి డాక్టర్లు ఒప్పుకున్నారు. గురువారం సాయంత్రం నుంచి ఆహారంతో పాటు మంచినీళ్లు కూడా తీసుకోవద్దని సూచించారు. శుక్రవారం ఉదయమే సిబ్బంది జయకు సర్జికల్‍ డ్రెస్‍ వేసి ఆపరేషన్‍ థియేటర్‍ కు తీసుకెళ్లారు. కాగా, ఆమెకంటే తర్వాత వచ్చినవారికి సర్జరీలు పూర్తవగా మధ్యాహ్నం వరకు జయను పట్టించుకోలేదు.

అప్పటికే 18 గంటలు ఖాళీ కడుపుతో ఉండడంతో నీరసించిన జయ స్పృహ తప్పింది. దీంతో బాధితురాలి బంధువులు.. సీనియర్​ యూరాలజిస్ట్​ డాక్టర్‍ సురేందర్​రెడ్డి, నోడల్​ ఆఫీసర్​ డాక్టర్​ గోపాల్​రావుతో త్వరగా ఆపరేషన్‍ చేయాలని కోరారు.  దీంతో 'డాక్టర్లపై కంప్లయింట్​ ఇచ్చి కేసులు పెడతారా? ఆపరేషన్‍ చేసేది లేదు. వెళ్లి పోలీసులతోనే చేయించుకో' అని సమాధానమిచ్చారు.  

కాంప్రమైజ్‍ చేసిన హాస్పిటల్‍ పెద్దలు

హాస్పిటల్​లో జరిగిన దానిపై కలత చెందిన బాధితురాలి భర్త అశోక్‍ శుక్రవారం మధ్యాహ్నం మళ్లీ పోలీస్‍ స్టేషన్‍ వెళ్లి చెప్పాడు. దీంతో ఇష్యూ పెద్దది కావొద్దనే ఉద్దేశంతో సీఐ రమేశ్​హాస్పిటల్‍ పెద్దలతో మాట్లాడారు. హాస్పిటల్‍ ఆర్‍ఎంఓ అశోక్‍ను పిలిపించి మాట్లాడారు. షుగర్‍ లెవెల్స్​పెరగడంతోనే సర్జరీ చేయలేదని చెప్పి సముదాయించారు. సోమవారం ఆపరేషన్‍ చేయించే  బాధ్యత తమదని భరోసా ఇచ్చారు.  

షుగర్‍ లెవెల్స్​పెరగడంతోనే.. సర్జరీ చేయలే 

జయకు డాక్టర్లు కావాలనే సర్జరీ చేయలేదనడం కరెక్ట్​కాదు. పేషెంట్‍కు షుగర్‍ లెవెల్స్​ పెరగడం వల్లే ఆపరేషన్‍ చేయలేదు. షుగర్‍ లెవెల్​ పెరిగే ఫుడ్‍ తీసుకోవద్దని చెప్పాం. అయినా వారు వినలేదు. ఇలాగే గతంలో రెండుసార్లు ఆపరేషన్‍ పోస్ట్​పోన్​ చేయాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పినా వినకుండా పీఎస్​కు వెళ్లారు. సోమవారం వరకు షుగర్‍ లెవెల్స్​ కంట్రోల్‍కు తెచ్చి సర్జరీ నిర్వహించేలా చూస్తాం.   -డాక్టర్‍ చంద్రశేఖర్‍,  ఎంజీఎం సూపరింటెండెంట్‍