భార్యను పిశాచి అనడం క్రూరత్వం కాదు: పాట్నా హైకోర్టు

భార్యను పిశాచి అనడం క్రూరత్వం కాదు: పాట్నా హైకోర్టు

పాట్నా: వైవాహిక జీవితంలో విఫలమైన జంట ఒకరినొకరు పిశాచి, భూతం అంటూ దూషించుకోవడం క్రూరత్వం కిందకు రాదని పాట్నా హైకోర్టు తెలిపింది. దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేస్తూ  సింగిల్ జడ్జి బెంచ్ జిస్టిస్ బిబేక్ చౌధురి ఈ ఆదేశాలు ఇచ్చారు. బిహార్​లోని నవాదాకు చెందిన మహిళకు జార్ఖండ్ బొకారోకు చెందిన నరేశ్ గుప్తాతో వివాహమైంది. అయితే, అదనపు కట్నం కింద కారును తీసుకు రావాలని తనను భర్తతో పాటు మామ సహదేవ్ గుప్తా వేధిస్తున్నారంటూ1994లో ఆమె నవాదాలో  కేసు వేశారు.

తండ్రీకొడుకుల అభ్యర్థనపై ఈ కేసు నలందకు బదిలీ అయింది. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ 2008లో వీరిద్దరికి ఒక ఏడాది జైలు శిక్ష విధించారు. దీనిపై వారు అదనపు సెషన్స్ కోర్టుకు,  ఆపై పాట్నా హైకోర్టుకు వెళ్లారు. మహిళ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ 21వ శాతాబ్దంలో మహిళను భూతం, పిశాచి అని పిలవడం క్రూరత్వమేనని అన్నారు. ఈ వాదనలను పాట్నా హైకోర్టు అంగీకరించలేదు. ‘‘వైవాహిక బంధాలలో, విఫలమైన వైవాహిక బంధాలలో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు దూషించుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే, ఇటువంటి ఆరోపణలు క్రూరత్వం కిందకు రావు" అని పాట్నా హైకోర్టు పేర్కొంది.