తాండూరు నుంచి పోటీ చేసి గెలుస్తా.. కేసీఆర్ నాకే టికెట్ ఇస్తారు : పట్నం మహేందర్ రెడ్డి

తాండూరు నుంచి పోటీ చేసి గెలుస్తా.. కేసీఆర్ నాకే టికెట్ ఇస్తారు  :  పట్నం మహేందర్ రెడ్డి

వికారాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఒక గుర్తు పైన గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వారందరని ప్రజలు తిరస్కరిస్తారని చెప్పారు. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరిగిందని, రాష్ట్రంలోనూ అదే పునరావృతమవుతుందన్నారు. తాను కారు గుర్తు పైనే గెలిచానని, వేరే పార్టీలో నుంచి  గెలిచి రాలేదన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేస్తామని  మహేందర్ రెడ్డి  పేర్కొన్నారు. ప్రజా క్షేత్రంలోకి పల్లెకు పల్లె పట్నం కార్యక్రమాన్ని జూన్ 21 నుంచి నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం తానే పోటీ చేస్తానని,  సీఎం కేసీఆర్ తనకే టికెట్ ఇస్తారని  మహేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు.  సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని అన్నారు.  గత ఎన్నికల్లో కారు గుర్తు అనుకొని కొందరు ట్రక్కు గుర్తుకు ఓటేయడంతోనే తాను ఓడిపోయానని చెప్పుకొచ్చారు.  

గతకొంతకాలంగా తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిల మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2018 ముందస్తు ఎన్నికల్లో తాండూరులో  పట్నం మహేందర్ రెడ్డిపై కాంగ్రెస్  అభ్యర్ధి అయిన పైలెట్ రోహిత్ రెడ్డి గెలిచారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. తాజాగా మహేందర్ రెడ్డి  చేసిన కామెంట్స్ పరోక్షంగా తాండూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ఉద్దేశించినవేనని తెలుస్తోంది.