
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ‘గబ్బర్ సింగ్’ సినిమాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. పవన్‌ను అభిమానులు ఎలా చూడాలని కోరుకున్నారో అలా చూపించి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించాడు హరీష్ శంకర్. అందుకే తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత పవన్, హరీష్ కాంబినేషన్‌లో రాబోయే సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. ‘భవధీయుడు భగత్‌సింగ్’ పేరుతో రూపొందే ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే క్రిష్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఓ కొలిక్కి వచ్చాక హరీష్ మూవీ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మ్యూజిక్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ చేసినట్టు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు దేవిశ్రీ ప్రసాద్. ‘గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ పవన్, హరీష్‌లతో కలసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గని ఔట్‌పుట్ కోసం కష్టపడుతున్నాం. ఇప్పటికే రెండు సాంగ్స్ కంపోజ్ చేశాను. చాలా ఎనర్జిటిక్‌గా, మెలోడియస్‌గా ఈ ఆల్బమ్ ఉండబోతోంది. త్వరలోనే షూట్ స్టార్ట్ అవుతుందని భావిస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు దేవిశ్రీ. ఇక పవన్, దేవిశ్రీ కాంబినేషన్‌లో గబ్బర్‌సింగ్‌తో పాటు జల్సా, అత్తారింటికి దారేది లాంటి మ్యూజికల్ హిట్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుంది.