
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచుతున్నాడు. సినిమాలకు గ్యాప్ ఇచ్చి పూర్తిగా 2024 ఎన్నికల మీద దృష్టి పెట్టాడు. ఈ నేపథ్యంలో పవన్ వైజాగ్ టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. వైజాగ్ నొవాటెలో హోటల్లో స్థానిక నాయకులతో భేటీ అయిన అనంతరం నాలుగు స్థానాలకు ఇన్ ఛార్జ్ లను ప్రకటించాడు. అయితే, అభ్యర్థులుగా కాకుండా సమన్వయ కర్తలు అంటూ అనౌన్స్ చేయటం ఆసక్తిగా మారింది.
భీమిలి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా వంశీకృష్ణ శ్రీనివాస్, గాజువాక ఇన్ ఛార్జ్ గా సుందరపు సతీష్, పెందుర్తికి పంచకర్ల రమేష్, యలమంచలికి సుందరపు విజయ్ లను ఇన్ ఛార్జ్ లుగా నియమించారు. ఈ క్రమంలో స్థానిక టీడీపీ క్యాడర్లో భయం మొదలైందనే చెప్పాలి. పొత్తు ధర్మంలో భాగంగా ఈ నాలుగు స్థానాల్లో జనసేన అభర్ధులకు తమ స్థానాలను త్యాగం చేయక తప్పదా అన్న మీమాంసలో పడ్డారు.
నిజానికి జనసేన ఇన్ఛార్జ్ లను అనౌన్స్ చేసిన నాలుగు స్థానాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. భీమిలి నుండి గంటా శ్రీనివాస్, గాజువాక నుండి పల్లా శ్రీనివాస్, యలమంచిలి నుండి ప్రగాఢ నాగేశ్వరరావు, పెందుర్తి నుండి బండారు సత్యనారాయణలు సీటు ఆశిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇరు పార్టీల స్థానిక నేతల మధ్య సమంవ్యం సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జ్ లను అనౌన్స్ చేసిన నాలుగు స్థానాలను 2019 ఎన్నికల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా, ప్రజారాజ్యం సమయంలో ఆ పార్టీ గట్టి పోటీని ఇచ్చింది.ఈ ఈక్వేషన్స్ ని బేస్ చేసుకొనే పవన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు అనిపిస్తోంది. మరోపక్క 22న పవన్ ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో టీడీపీ, జనసేన శ్రేణుల్లో ఉత్కంఠ మొదలైంది. మరి, ఈ పర్యటన తర్వాత అయినా టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు, సీట్ల పంపకం వంటి అంశాల్లో క్లారిటీ వస్తుందేమో చూడాలి.