
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జెట్ స్పీడుతో జరుగుతోంది. ఇందులో నటిస్తున్న ఇతర నటీనటుల వివరాలను మంగళవారం ప్రకటించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్‌తో పాటు బ్రహ్మానందం, రోహిణి, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. తమిళంలో సముద్రఖని తీసిన ‘వినోదయ సిత్తం’కు ఇది తెలుగు రీమేక్. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ సెట్‌లో సాయి తేజ్ నటించిన ఈ మరో చిత్రం ‘విరూపాక్ష’ టీజర్‌ను చూసిన పవన్ కళ్యాణ్.. టీజర్ చాలా ఇంటరెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉందని టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్‌ను షేర్ చేస్తూ ‘ఇంతకు మించి ఏమీ అడగలేను. ‘విరూపాక్ష’ చిత్రం నాకెంతో కీలకం. నా గురూజీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు పొందడం, ఆయన నుండి గొప్ప మాటలు వినడమే ఓ సెలెబ్రేషన్. థ్యాంక్యూ కళ్యాణ్ మామా.. మీ ప్రేమ, ప్రశంసలు నాతో ఎప్పటికీ ఉంటాయి’ అని ట్వీట్ చేశాడు తేజ్. బుధవారం ఈ టీజర్‌ను లాంచ్ చేయనున్నారు. ఏప్రిల్ 21న సినిమా విడుదల కానుంది.