సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ కామెంట్స్ హాస్యాస్పదం

సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ కామెంట్స్ హాస్యాస్పదం

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను కేంద్రం నెరవేర్చాలని  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. కేంద్రం తెలుగు రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయంపై బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడతానని తెలిపారు. ఈ ధర్నాకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాలని ఆయన కోరారు. కేసిఆర్, జగన్, పవన్ కళ్యాణ్ సహా ఇతర పార్టీల నాయకులు ధర్నాకు రావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఈ ధర్నాకు వచ్చి తనతోపాటు పదినిమిషాలు కూర్చోవాలని చెప్పారు. కరోనా సమయంలో పారాసిట్మాల్ వేసుకోవాలని కేసీఆర్ చెప్పడం వల్ల లక్షల మంది చనిపోయారని ఆరోపించారు.

సీఎం కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ కామెంట్స్ హాస్యాస్పదంగా ఉన్నాయని కేఏ పాల్ అన్నారు. సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం సిగ్గుచేటన్నారు. పవన్ కళ్యాణ్ కి జగన్ ను తిట్టడం తప్ప ఇంకేమి తెలియదన్నారు. పవన్ పదేళ్లలో 9 పార్టీలతో జతకట్టాడని..ఆయన రాజకీయాలకు పనికిరాడని పాల్ విమర్శించారు. జేడీ లక్ష్మీనారాయణ లాంటి నాయకులే ఆయన పార్టీ విడిచి వెళ్లిపోయారన్నారు. తను హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ పెడతానంటే గుజరాత్ లో పెట్టాలని బీజేపీ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారని..తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం హైదరాబాద్ లోనే గ్లోబల్ సమ్మిట్ పెడతానని చెప్పారు.

రాజకీయ నాయకుల బెదిరింపులకు తాను భయపడనని...8 కోట్ల తెలుగు ప్రజల బాగుకోసం ఎంత వరకైనా వెళ్తానని కేఏ పాల్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఐదు లక్షల కోట్లు..ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 8 కోట్ల లక్షల అప్పులు చేశారని ఆరోపించారు. మన దేశం కూడా త్వరలో వెనిజులా, శ్రీలంక కాబోతోందని వ్యాఖ్యానించారు. ఆగస్టు 15 లోపు కేంద్రం విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు