ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే  చేతులు కట్టుకుని కూర్చోవాలా?..రెచ్చగొడితే ఎదురుదాడి తప్పదు: పవన్‌‌‌‌కల్యాణ్‌‌‌‌

ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే  చేతులు కట్టుకుని కూర్చోవాలా?..రెచ్చగొడితే ఎదురుదాడి తప్పదు: పవన్‌‌‌‌కల్యాణ్‌‌‌‌
  • జగన్ జైలుకెళ్తే నాకు లాభమనేది పిచ్చి లాజిక్
  • వ్యక్తిగత విమర్శలు చేస్తే దీటుగా బదులిస్తామని వెల్లడి
  • తమిళనాడులో కటౌట్లు పెట్టి సీఎంలయ్యారని కామెంట్

రాజమహేంద్రవరం: తనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవాలా ? మాకు కోపం రాదా? అని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌‌‌‌ కల్యాణ్‌‌‌‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  తాను అన్నీ పోగొట్టుకునేందుకు సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొంటూ కొన్ని వెబ్‌‌‌‌సైట్లు, సోషల్‌‌‌‌ మీడియా హ్యాండిల్స్‌‌‌‌పై నిప్పులు చెరిగారు.సోమవారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన జనసేన నేతలు, కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడారు.

తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తే తాము కూడా అదే స్థాయిలో దీటుగా ఎదురుదాడి చేస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా, ఎలాంటి గొడవకైనా సిద్ధమంటూ తనను విమర్శించే వారికి ఛాయిస్ ఇచ్చిన ఆయన..అనవసరంగా తనను రెచ్చగొట్టవద్దని స్పష్టం చేశారు. జగన్‌‌‌‌ జైలుకు వెళ్తే తనకు లాభం చేకూరుతుందని కొందరు విశ్లేషకులు చెప్పడం పిచ్చి లాజిక్ అని కొట్టిపారేశారు.

చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడే తాను ప్రయత్నిస్తే సీఎం అయ్యేవాడినని గుర్తు చేశారు. శత్రువు బలంగా ఉన్నప్పుడే కొట్టడమే తన సిద్ధాంతమన్నారు. తన మౌనం బలహీనత కాదని, సరైన సమయం కోసం గట్టిపడుతున్నానని చెప్పారు. విశ్లేషించే వారి తప్పులను ప్రశ్నిస్తే కులం కార్డును తెరపైకి తేవడం సరికాదన్నారు.

పదవుల కోసమైతే పార్టీలో ఉండొద్దు

పార్టీని నడపాలంటే క్రమశిక్షణ ఎంతో అవసరమని, అది ఉంటేనే కూటమిలో బలం ఉంటుందని పవన్ కల్యాణ్ హితవు పలికారు. జనసేన నేతలకు పదవులు ఇవ్వగానే పెద్దమనుషులుగా మారి మాట్లాడటం మానేశారని, కేవలం పదవుల కోసమే అయితే పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ కూడా జనసేన జెండా పట్టుకుని నిలబడే మహిళలే పార్టీకి అసలైన బలమని, పోరాడటమే జనసేన మూల లక్షణమని గుర్తు చేశారు. ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసమే తాను కూటమి ధర్మాన్ని పాటిస్తూ కొన్నిసార్లు సర్దుకుపోతున్నాననే విషయాన్ని పార్టీ నేతలు గుర్తించాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

ఇదే సమయంలో తమిళనాడు రాజకీయాలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడ రాజకీయం ఎంతో సాఫీగా, తనకు అసూయ కలిగేంత సుఖంగా సాగిందన్నారు. తమిళనాడులో  కేవలం కటౌట్లు, హలోగ్రామ్స్ పెట్టుకుని గెలిచేసి సీఎంలు అయిపోయారని, కానీ తనను మాత్రం 15 ఏండ్లు రోడ్డు మీద దేకించారంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. తాను ఈ స్థాయికి రావడానికి 12 ఏండ్లు పట్టిందని, రాజకీయ పార్టీ నడపడం అంత సులువు కాదని పవన్ పేర్కొన్నారు.