జగిత్యాల/కొండగట్టు/ హైదరాబాద్, వెలుగు: కొండగట్టు ఆంజనేయ స్వామిని శనివారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా రూ.35.19 కోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిధులతో కొండగట్టులో నిర్మించనున్న దీక్ష విరమణ మండపం, 96 విశ్రాంతి గదులతో కూడిన సత్రంకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు.
ఒకేసారి 2 వేల మంది మాలవిరమణ చేసేలా దీక్షా విరమణ మండపాన్ని నిర్మించనున్నారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీటీడీ బోర్డు మెంబర్లు పాల్గొంటారు.
పవన్‌కల్యాణ్‌ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండడంతో 1,100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. శిలాఫలకం ఆవిష్కరించే చోట 600 మందికి సరిపోయేలా తాత్కాలికంగా భారీ షెడ్లను నిర్మించారు.
ఈ ఏర్పాట్లను కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా, శంకుస్థాపన తరువాత కొడిమ్యాలలోని బృందావనం రిసార్ట్ లో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.
