సంక్రాంతికి వినోదాల జాతర.. ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్ అవుతుందో క్లారిటీ వచ్చేసింది !

సంక్రాంతికి వినోదాల జాతర.. ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్ అవుతుందో క్లారిటీ వచ్చేసింది !

కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికిన  తరుణంలో  ఇప్పటికే కొన్ని చిన్న  చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే అందరి చూపు సంక్రాంతి సినిమాల పైనే ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి అతిపెద్ద సీజన్. సంక్రాంతి సినిమాలతో ఈ ఏడాది బాక్సాఫీస్‌‌ను కొల్లగొట్టేందుకు పందెం కోళ్లలా స్టార్ హీరోలు, యువ హీరోలు బరిలోకి దిగుతున్నారు. సింహభాగం వినోదానికి పెద్ద పీట వేస్తున్న చిత్రాలే కావడం విశేషం. మరి సంక్రాంతికి రాబోతున్న ఆ సినిమాలపై ఓ లుక్కేద్దాం..

హారర్ ఫాంటసీ జానర్‌‌‌‌లో రెబల్ సాబ్
తెలుగు సినిమాకు పెద్దపండుగగా భావించే సంక్రాంతి సీజన్‌‌లో ముందుగా వస్తున్న సినిమా ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ హారర్ ఫాంటసీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ జనవరి 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్‌‌గా నటించారు. సంజయ్ దత్‌‌, జరీనా వాహెబ్, బోమన్ ఇరానీ కీలకపాత్రలు పోషించారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.

నానమ్మను కాపాడుకునేందుకు మయసభ లాంటి తాత భవనంలోకి ఫ్రెండ్స్‌‌తో కలిసి అడుగుపెట్టిన రాజా సాబ్‌‌కు ఎలాంటి ప్రమాదాలు ఎదురయ్యాయి, వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది మెయిన్ కాన్సెప్ట్‌‌. వరుస యాక్షన్ సినిమాల తర్వాత అభిమానుల కోసం తన పాన్‌‌ ఇండియా స్టార్‌‌‌‌డమ్‌‌ను పక్కనపెట్టి పూర్తిస్థాయి ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌లో నటించారు రెబల్ సాబ్ ప్రభాస్. తన క్యారెక్టర్‌‌‌‌లో డిఫరెంట్‌‌ షేడ్స్‌‌ ఉండబోతున్నాయని ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్‌‌ కంటెంట్‌‌తో అర్థమవుతోంది. 

భర్త మహాశయులకు మాస్‌‌ మహారాజా విజ్ఞప్తి
చిరంజీవి తరహాలోనే రవితేజ కూడా పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌తో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌‌గా నటించారు. సునీల్, వెన్నెల కిషోర్, సత్య ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఇందులో రామసత్యనారాయణగా రవితేజ నటించగా, ఆయన భార్యగా డింపుల్ నటించింది.

స్పెయిన్‌‌ వెళ్లిన హీరో మరొకరికి దగ్గరవడం, ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ చిత్ర ప్రధాన కథ. ఫ్యామిలీ ఎమోషన్స్‌‌ విత్ కామెడీ ఎలిమెంట్స్‌‌తో ప్రేక్షకులను ఎంటర్‌‌‌‌టైన్ చేయడమే టార్గెట్‌‌గా ఈ సినిమా చేసినట్టు అర్థమవుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న జనం ముందుకొస్తోంది.

నారీ నారీ నడుమ శర్వా
రవితేజ తరహాలోనే శర్వానంద్ కూడా ఇద్దరు భామల మధ్య నలిగిపోయే ‘నారీ నారీ నడుమ మురారి’గా సంక్రాంతికి వస్తున్నాడు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి రెడీ అవుతున్న సమయంలో మాజీ ప్రియురాలు తన ఆఫీస్‌‌ బాస్‌‌గా ఎంట్రీ ఇస్తే ఆ కుర్రాడి పరిస్థితి ఏమిటి అనేది ఈ చిత్ర ప్రధాన కథ. 

సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్స్‌‌. రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న సాయంత్రం ఆటతో విడుదలవుతోంది. గతంలో సంక్రాంతికి వచ్చి విజయాలు అందుకున్న శర్వా.. మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.

జాతిరత్నం పెళ్లి రచ్చ
తనదైన శైలి వినోదంతో వరుస విజయాలు అందుకుంటున్న నవీన్ పొలిశెట్టి.. సంక్రాంతికి ‘అనగనగా ఒకరాజు’తో అలరించబోతున్నాడు. మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్. మారి దర్శకుడు. పెళ్లి, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్‌‌ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. జనవరి 14న థియేటర్స్‌‌కు వస్తోంది.

జననాయకుడిగా విజయ్​
కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన ‘జననాయగన్‌‌’ చిత్రం ‘జననాయకుడు’ పేరుతో జనవరి 9న విడుదల కానుంది. హెచ్.వినోద్ దీనికి దర్శకుడు. పూజాహెగ్డే హీరోయిన్. అలాగే శివకార్తికేయన్, శ్రీలీల జంటగా సుధా కొంగర తెరకెక్కించిన ‘పరాశక్తి’ జనవరి 10న విడుదలవుతోంది.

మెగాస్టార్ పండక్కి వస్తున్నారు
‘వాల్తేరు వీరయ్య’ చిత్రం తర్వాత మరోసారి సంక్రాంతికి వస్తున్నారు చిరంజీవి. ఆయన హీరోగా అనిల్‌‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’.  ‘పండక్కి వస్తున్నారు’ అనే ట్యాగ్‌‌లైన్‌‌కు తగ్గట్టుగా జనవరి 12న సంక్రాంతికి వస్తున్నారు. నిజానికి ‘విశ్వంభర’ సంక్రాంతికి విడుదల కావల్సి ఉండగా వీఎఫ్‌‌ఎక్స్‌‌ వర్క్స్‌‌ ఆలస్యంతో జూన్‌‌కి వాయిదా పడింది.

శంకర వరప్రసాద్ పాత్రలో చిరంజీవి, శశిరేఖగా నయనతార భార్యాభర్తలుగా నటించారు. గతేడాది అనిల్‌‌ డైరెక్షన్‌‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్ ఇందులో కీలకపాత్ర పోషించారు. కేథరిన్ థ్రెస్సా, వీటీవీ గణేష్‌‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌‌తో పాటు ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌కు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు.