
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆదివారం జరిగిన ఘర్షణలో గాయపడిన వైసీపీ నాయకులు, కార్యకర్తలను పవన్ పరామర్శించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలపై దాడి దురదృష్టకరమన్నారు. పండుగ సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం శోచనీయమన్నారు.
ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాడిన భాష దారుణమని.. ప్రజాప్రతినిధిగా ఉండి వాడకూడని భాష ఉపయోగించారని పవన్ మండిపడ్డారు. గోదావరి జిల్లాల్లో ఇలాంటి భాషవాడే ప్రజాప్రతినిధిని చూడలేదని వ్యాఖ్యానించారు. రెండ్రోజుల్లో విజయవాడలో కీలక సమావేశం ఉంటుందని, ద్వారపూడిలాంటి చీడపురుగుల్ని రాజకీయాల నుంచి వెలివేయకపోతే.. మనమంతా తప్పుచేసిన వాళ్లం అవుతామని ఆయన అన్నారు. మా ఆడపడుచులను దూషించడం క్షమించరాని నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సహనం చేతకాని తనం కాదన్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించాలనుకుంటే మీరెవరూ ఇక్కడ ఉండరన్నారు.
అధికారం శాశ్వతం కాదన్న విషయం నేతలు గుర్తుపెట్టుకోవాలన్నారు. అధికారం శివుడి మెడలో పాములాంటిదని, అధికారం దిగిన తర్వాత పరిస్థితి ఏంటని గుర్తుంచుకోవాలన్నారు. ఆడపడుచుల మీద పడిన దెబ్బ నాకు ఎప్పటికీ గుర్తుంటుందని పవన్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. పచ్చిబూతులు తిట్టి.. దాడులు చేస్తే పోలీసులు చోద్యం చూడటం సరికాదన్నారు. పోలీసులు సుమోటోగా తీసుకొని విచారించాల్సిందని పేర్కొన్నారు. ఇంకొక్క సంఘటన మావాళ్లపై జరిగితే చేతులు కట్టుకొని కూర్చోమన్నారు పవన్ కళ్యాణ్ .