ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ఎన్నికల నేపథ్యంలో ఎంతోకాలంగా విడిపోయిన ఠాక్రే సోదరులు శివసేన (యూబీటీ) చీఫ్ఉద్ధవ్ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్రాజ్ఠాక్రే ఇటీవల కలిసిపోగా.. తాజాగా పవార్ఫ్యామిలీ ఒక్కటైంది. జనవరి 15న జరగనున్న పింప్రి –చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శరద్ పవార్ ఎన్సీపీ(ఎస్ పీ), ఎన్సీపీ కలిసి పోటీ చేయనున్నట్టు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ తెలిపారు.
పింప్రి – చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు పవార్ఫ్యామిలీ మళ్లీ ఒక్కటైందని ఆదివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అజిత్ పవార్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీకి గడియారం గుర్తును, శరద్ పవార్ ఎన్సీపీ(ఎస్పీ) పార్టీకి తుతారి గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.
1999లో శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. రెండు దశాబ్దాలకు పైగా ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. శరద్ పవార్ సోదరుడి కొడుకు అయిన అజిత్ పవార్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉండి, పలుమార్లు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అయితే, 2023లో శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీ నుంచి అజిత్ పవార్ విడిపోయి.. బీజేపీ, ఏక్‌నాథ్ షిండే శివసేన కూటమిలో చేరారు. అనంతరం మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ఆ తర్వాత ఎన్సీపీ రెండుగా విడిపోయింది. అజిత్ పవార్ విభాగం మహారాష్ట్రలో పాలక ఎన్‌డీఏ కూటమితో కలిసిపోయింది. ఎన్నికల సంఘం ఆయన విభాగాన్నే చట్టబద్ధ ఎన్‌సీపీగా గుర్తించి గడియారం గుర్తును కొనసాగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) స్వతంత్రంగా కొనసాగుతూ తుతారి గుర్తును తీసుకుంది. కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ విభాగం ఓడిపోయింది. దీంతో తాను తన కుటుంబాన్ని వదిలేసి తప్పు చేశానని అజిత్ పవార్ ఒప్పుకున్నారు.
