PBKSvsKKR : అర్ష్ దీప్ సింగ్ అదుర్స్..ధావన్ సేన్ బోణి

PBKSvsKKR : అర్ష్ దీప్ సింగ్ అదుర్స్..ధావన్ సేన్ బోణి

ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్‌ బోణి కొట్టింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా నిలిచిన మ్యాచ్‌లో అంపైర్లు డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పంజాబ్ గెలిచినట్లు ప్రకటించారు. 

192 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్..రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్  మన్‌దీప్ సింగ్ (2) ను అర్ష్ దీప్ సింగ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అనుకుల్ రాయ్ (4) పెవీలియన్ చేరాడు. ఈ సమయంలో రహ్మనుల్లా గుర్బాజ్ (16 బంతుల్లో 22, 3 ఫోర్లు, 1 సిక్సర్), వెంకటేష్  అయ్యర్ (28 బంతుల్లో 34, 3 ఫోర్లు, 1 సిక్సర్) కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే 29 పరుగుల వద్ద గుర్భా్జ్ నాథ్ ఎల్లీస్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. దీంతో కోల్ కతా 29 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

ఆదుకున్న అయ్యర్..రాణా

ఈ దశలో కోల్ కతాను వెంకటేశ్ అయ్యర్,  కెప్టెన్ నితీశ్ రాణా (17 బంతుల్లో 24, 3 ఫోర్లు, 1 సిక్సర్) ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్కు  46 పరుగులు జోడించారు. అయితే  రజా వేసిన  పదో ఓవర్లో కెప్టెన్ నితీష్ రాణా పెవిలియన్ చేరాడు.  ఆ తర్వాత చహర్ బౌలింగ్లో  రింకూ సింగ్  (4)  బౌల్డ్ అయ్యాడు.  దీంతో కేకేఆర్ 83 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 

వర్షం అంతరాయం..

ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ఆండ్రీ రస్సెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 2 సిక్సర్లు, 3 ఫోర్లతో రెచ్చిపోయాడు. 19 బంతుల్లో 39 పరుగులు చేసిన రస్సెల్‌ను సామ్ కరన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే వెంకటేశ్ అయ్యర్‌ కూడా ఔటయ్యాడు. కేకేఆర్ విజయానికి 24 బంతుల్లో 46 పరుగులు కావాల్సిన సమయంలో వాతన ఆటకు అంతరాయం కలిగించింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పంజాబ్ కింగ్స్ 7 పరుగుల తేడాతో గెలిచినట్టు అంపైర్లు ప్రకటించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు, సామ్ కర్రన్, నాథన్ ఎల్లీస్, సికందర్ రజా, రాహుల్ చాహర్ తలో ఓ వికెట్ పడగొట్టారు. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటింగ్కు దిగిన కొద్దిసేపటికే 23 పరుగుల వద్ద ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఔటయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన బానుక రాజపక్స రెచ్చిపోయాడు. కెప్టెన్ ధావన్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇదే క్రమంలో 32 బంతుల్లో 5 ఫోర్లు,2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత బానుక రాజపక్స 109 పరుగుల వద్ద ఔటయ్యాడు.

  
టపా టపా..

బానుక రాజపక్స తర్వాత క్రీజులోకి వచ్చిన జితేష్ శర్మ మెరుపులు మెరిపించాడు. 11 బంతుల్లో రెండు సిక్సర్లు, ఫోర్తో 21 పరుగులు చేశాడు. అయితే కీలక సమయంలో 135 పరుగుల వద్ద టీత్ సౌతీ బౌలింగ్లో పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే సికందర్ రజా ఔటయ్యాడు. దీంతో పంజాబ్ 168 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 

చెలరేగిన కర్రన్..

చివర్లో వచ్చిన సామ్ కర్రన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సులతో స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 17 బంతుల్లో 26 పరుగులు పిండుకున్నాడు. ఇతనికి షారుక్ ఖాన్ 11 పరుగులతో సహకరించడంతో ..పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో తీమ్ సౌతీ 2 వికెట్లు దక్కించుకోగా..ఉమేష్ యాదవ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు.