
ఆదివారం (సెప్టెంబర్ 21) ఇండియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి ఔటయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ సీరియస్ గా తీసుకుంది. ఫకర్ జమాన్ వివాదాస్పద ఔట్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సోమవారం (సెప్టెంబర్ 22) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కి అధికారిక ఫిర్యాదు చేసింది. టీవీ అంపైర్ రుచిర పల్లియగురుగే ఫఖర్ జమాన్‌ను తప్పుగా ఔట్ ఇచ్చాడని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావించింది. పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో ఈ సంఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే..?
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు చేసిన పాకిస్థాన్ తొలి రెండు ఓవర్లో 17 పరుగులు రాబట్టి పర్వాలేదనిపించినా మూడో ఓవర్లో ఫకర్ జమాన్ వికెట్ కోల్పోయింది. అయితే రీప్లేలో ఫకర్ నాటౌట్ అయినట్టుగా అర్ధమవుతోంది. ఇన్నింగ్స్ మూడో ఓవర్ మూడో బంతిని పాండ్య ఆఫ్ సైడ్ దూరంగా బంతిని విసిరాడు. దూరంగా వెళ్తున్న బంతిని ఫకర్ జమాన్ కట్ చేయబోతే బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ సంజు శాంసన్ చేతిలో పడింది. బంతి వికెట్ కీపర్ వద్దకు తక్కువ ఎత్తులో వెళ్లడంతో శాంసన్ క్యాచ్‌ను పట్టుకోవడానికి ముందుకు డైవ్ చేశాడు. దీంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ ను సంప్రదించాడు.
రీప్లేలో బంతి స్పష్టంగా నేలను తాకినట్టు కనిపించినా థర్డ్ అంపైర్ మాత్రం ఔట్ గా ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఫకర్ జమాన్ ఔట్ పై తీవ్ర చర్చ నడిచింది. పాకిస్థాన్ ప్లేయర్లు, ఫ్యాన్స్ తో పాటు బోర్డు అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఫకర్ జమాన్ ఔటవ్వడంతో పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. 9 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన ఈ పాక్ ఓపెనర్ అంపైర్ నిర్ణయానికి షాక్ అయ్యి నిరాశగా పెవిలియన్ కు చేరాడు.
మరో 20 పరుగులు చేసేవాళ్ళం:
మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఫకర్ జమాన్ నాటౌట్ అని తాము నమ్ముతున్నామని అన్నాడు. ఫఖర్‌ను అవుట్‌గా ప్రకటించకపోతే పాకిస్తాన్ మరో 20 పరుగులు అదనంగా చేసి ఉండేదని.. కానీ అంపైర్ ఔటివ్వడంతో తాము షాక్ అయ్యామని తెలిపాడు. సల్మాన్ మాట్లాడుతూ.. "అంపైర్లు తప్పులు చేయవచ్చు. కానీ అది కీపర్ కంటే ముందు బౌన్స్ అయినట్లు నాకు అనిపించింది. నేను తప్పు కావచ్చు. (ఫఖర్) బ్యాటింగ్ చేస్తున్న విధానం చూస్తే అతను పవర్ ప్లే వరకు ఉంటే మేము బహుశా 190 పరుగులు చేసి ఉండేవాళ్ళం. బంతి నేలను తాకినట్లు మేము భావించాము. కానీ అంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం" అని సల్మాన్ మ్యాచ్ తర్వాత విలేకరుల సమావేశంలో అన్నాడు.