హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా పిప్రీలో ఈ నెల 6న జరుగనున్న ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక’బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే ఈ సభ కోసం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ఇన్‌చార్జిలను నియమించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో మీడియాకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఇన్‌చార్జిలుగా ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ముత్యాల సునీల్ రెడ్డి, ఆసిఫాబాద్‌కు తాహెర్ బిన్ అహ్మద్, ఖానాపూర్‌కు వినయ్ రెడ్డి, ముధోల్ నియోజకవర్గాలకు శేఖర్ గౌడ్, మల్ రెడ్డి రంగారెడ్డిలను నియమించారు. సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని, సమన్వయంతో గ్రాండ్ సక్సెస్ చేయాలని పీసీసీ చీఫ్ ఈ సందర్భంగా ఇన్‌చార్జిలను ఆదేశించారు.
