సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌ తీరుపై బీఆర్ఎస్ మౌనమెందుకు? : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌ తీరుపై బీఆర్ఎస్ మౌనమెందుకు? : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • బీజేపీకి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌‌రావు ఎందుకు భయపడుతున్నరు?: మహేశ్ గౌడ్ 
  •     ఆ పార్టీతో లోపాయికారి ఒప్పందంతోనే మౌనమా? 
  •     ఫార్ములా ఈ రేస్‌‌ కేసులో అరెస్టు చేస్తారనే భయమా?
  •     బీజేపీ తదుపరి టార్గెట్ తెలంగాణ, పంజాబ్
  •     అందుకే రాష్ట్రంలో దురుద్దేశంతోనే సర్ ప్రక్రియ
  •     రాష్ట్రంలో 90 లక్షల ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తున్నారన్న పీసీసీ చీఫ్​ 

హైదరాబాద్, వెలుగు:  సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై, ఆయన తప్పిదాలపై బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌‌రావు ఎందుకు మాట్లాడటంలేదని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. ‘‘బీజేపీ అంటే బీఆర్ఎస్ నేతలకు భయమెందుకు? ఆ పార్టీతో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఉన్న లోపాయికారి ఒప్పందంతోనే తెలంగాణలో సర్‌‌‌‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసనలు, ధర్నాలు చేపట్టడం లేదు” అని ఆరోపించారు. మహేశ్ గౌడ్ శుక్రవారం  గాంధీ భవన్‌‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. 

దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్‌‌ కుమార్‌‌‌‌కు వ్యతిరేకంగా బీజేపీ, దాని మిత్ర పక్షాలు మినహా మిగిలిన పార్టీలన్నీ రోడ్డెక్కితే.. ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ నిరసనలకు దూరంగా ఉందన్నారు. సర్ తప్పిదాలపై బీజేపీని ప్రశ్నిస్తే కాళేశ్వరం, ఫార్ములా ఈ రేస్ కేసులో అరెస్టు చేస్తారేమోననే భయం కావచ్చేమోనని అన్నారు. ఉండటానికి ఇల్లు లేదన్న కేటీఆర్‌‌‌‌కు ఫైవ్ స్టార్ హోటళ్లు ఎలా వచ్చాయని, ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడివని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారని మహేశ్ గౌడ్ అన్నారు. బీజేపీ తదుపరి టార్గెట్ తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలేనని, అందుకే ఇక్కడ దురుద్దేశపూర్వకంగా సర్ ప్రక్రియను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో వివిధ కారణాలతో 90 లక్షల ఓట్ల తొలగింపునకు బీజేపీ కుట్ర పన్నిందన్నారు. ఎక్కువగా దళితులు, గిరిజనులు, మైనార్టీల ఓట్లనే తొలగిస్తున్నారని, పశ్చిమ బెంగాల్‌‌లో రోహింగ్యాల పేరుతో ఓట్లు తొలగించి టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ గెలుపును అడ్డుకున్నారని విమర్శించారు. బీహార్‌‌‌‌లో ఆర్జెడీ, కాంగ్రెస్ కూటమి గెలవకుండా సర్ పేరుతో అడ్డుకున్నారని అన్నారు. 

గతంలో ఎప్పుడూ ఇలా జరగలే.. 

గతంలో ఎన్నోసార్లు ఓట్ల నమోదు, తొలగింపు జరిగినా.. ఇలా ఎప్పుడు జరగలేదని మహేశ్ గౌడ్ అన్నారు. టీఎన్ శేషన్, లింగ్డో, కృష్ణమూర్తి వంటి వారి హయాంలో కేంద్ర ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేసిందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఓటును కాపాడుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. కేంద్రం తప్పిదాలపై ప్రశ్నించే ఏ పార్టీకైనా కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. వయస్సుతో సంబంధ లేకుండా కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వంటి వారు సర్‌‌‌‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని, ప్రతిపక్ష నేతలుగా రాహుల్, ప్రియాంక ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు చేస్తే కేంద్రం అడ్డుకుంటోందని తప్పుబట్టారు. సీఈసీని తొలగించే వరకు కాంగ్రెస్ నిరసనలు కొనసాగుతాయని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనుకుంటే 2009లోనే ఆ అవకాశం వచ్చిందని, మోదీలా అధికార వ్యామోహం రాహుల్‌‌కు లేదన్నారు. రాష్ట్రంలో ముషీరాబాద్ వంటి నియోజకవర్గాల్లో సర్ ప్రక్రియలో తప్పు జరిగిందని, అర్హుల పేర్లు తొలగించినట్టు అధికారులు ఒప్పుకున్నారని చెప్పారు. సర్‌‌‌‌పై కాంగ్రెస్ తీరును తప్పుపట్టినట్లుగా సినీ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్లలో ఎలాంటి వాస్తవాలు లేవన్నారు.