ఆర్టీసీ విలీనం కాంగ్రెస్ తోనే సాధ్యం..కార్మికుల పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తాం : PCC చీఫ్ మహేశ్ గౌడ్

ఆర్టీసీ విలీనం కాంగ్రెస్ తోనే సాధ్యం..కార్మికుల పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తాం : PCC చీఫ్ మహేశ్ గౌడ్
  •     ఆర్టీసీ ఎన్నికల ప్రచార సభలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కాంగ్రెస్‌‌తోనే సాధ్యమని పీసీసీ చీఫ్​మహేశ్​కుమార్ గౌడ్ అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు పెండింగ్‌‌లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 9 న జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో  కాంగ్రెస్, ఐఎన్టీయూసీ బలపరిచిన తెలంగాణ వర్కర్స్‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌(టీడబ్ల్యూయూ)కు చెందిన బాణం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కార్మికులను కోరారు. ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హైదరాబాద్‌‌లోని గౌలిగూడ సీబీఎస్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన టీడబ్ల్యూయూ సభలో ఆయన మాట్లాడారు. 

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్​రెడ్డితో చర్చించామని, ఆయన సానుకూలంగా స్పందించడంతో టీడబ్ల్యూయూకు అధికారికంగా మద్దతు ప్రకటించామన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు రెండు డీఏలు మంజూరు చేయడంతోపాటు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని, 2 వేలకు పైగా కారుణ్య నియామకాలు చేపట్టామని తెలిపారు.

టీడబ్ల్యూయూకు మద్దతివ్వండి 

ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ కోదండరామ్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. గతంలో ఆర్టీసీ సమ్మె సందర్భంగా కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పలువురు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఆర్టీసీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీడబ్ల్యూయూకు మద్దతిచ్చి, గెలిపించాలని కోరారు. సంఘం అధ్యక్షుడు మొగిళ్ల రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభకు ఏఐసీసీ  కార్యదర్శి సచిన్‌‌‌‌‌‌‌‌ సావంత్‌‌‌‌‌‌‌‌, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, పార్టీ నేత రాములు నాయక్‌‌‌‌‌‌‌‌,  టీడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి,  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌ నేత   చల్ల నర్సింహ్మారెడ్డి, ఐఎన్టీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు సత్యజిత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, మాజీ మేయర్‌‌‌‌‌‌‌‌ బొంతు రామ్మోహన్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ ప్రధాన కార్యదర్శి వీఎస్‌‌‌‌‌‌‌‌ రావు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన ఆర్టీసీ ఎన్నికల ప్రచారం

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారానికి బుధవారం తెరపడింది. ఈ నెల 9న పోలింగ్ జరగనుండగా, ప్రచారానికి చివరిరోజున పోటీలో ఉన్న పలు కార్మిక సంఘాలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. దాదాపు దశాబ్దం తర్వాత రాష్ట్రంలో ఆర్టీసీ గుర్తింపు  సంఘం ఎన్నికలు జరుగుతుండడంతో అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.