బాకీ పడ్డది మీరే.. మీ హయాంలో హామీలన్నీ ఎగ్గొట్టి మాపై దుష్ప్రచారమా?: మహేశ్ కుమార్ గౌడ్

బాకీ పడ్డది మీరే.. మీ హయాంలో హామీలన్నీ ఎగ్గొట్టి మాపై దుష్ప్రచారమా?: మహేశ్ కుమార్ గౌడ్
  • బీఆర్ఎస్‌ ‘బాకీ కార్డు’ ప్రచారంపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్
  • మేం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నం 
  • రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉద్యోగాలు, ఫ్రీ కరెంట్ ఇస్తే బాకీ పడ్డట్టా? 
  • బాకీలు, బకాయిల గురించి మాట్లాడితే కేసీఆరే మొదటి ముద్దాయి 
  • మీరు చేసిన అప్పులకు మేం వడ్డీలు కడుతున్నం 
  • స్థానిక, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపని ధీమా


హైదరాబాద్, వెలుగు: ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టి ప్రజలకు బాకీ పడ్డది బీఆర్ఎస్ పార్టీనే అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి వాళ్లు చేసిన అప్పులకు తాము ఇప్పుడు వడ్డీలు కడుతున్నామని చెప్పారు. మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మహేశ్ గౌడ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ‘బాకీ కార్డు’ ప్రచారంపై బీఆర్‌‌ఎస్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. బాకీలు, బకాయిల గురించి బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడడం అంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టేనని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ చేస్తున్న బాకీ కార్డు ప్రచారంపై తెలంగాణ జనం నవ్వుకుంటున్నారని అన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్‌కు బకాయి అనే పదం ఎత్తే అర్హత లేదన్నారు.


బాకీలు, బకాయిల గురించి బీఆర్ఎస్ మాట్లాడితే మొదటి ముద్దాయి కేసీఆరేనని ఫైర్ అయ్యారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రుణమాఫీ చేసింది ఎంత? కాంగ్రెస్ 15 నెలల పాలనలో జరిగిన రుణమాఫీ ఎంత? అనే దానిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ‘‘పదేండ్ల బీఆర్ఎస్ పాలన నవాబుల పాలనలా సాగింది. తెలంగాణను సర్వనాశనం చేసినోళ్లు ఇప్పుడు బకాయిల గురించి మాట్లాడుతున్నారు. 40 లక్షల మందికి రేషన్ కార్డులు బాకీ పడ్డది మీరు కాదా?” అని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. 

హామీలు నెరవేరిస్తే బాకీ పడ్డట్టా?

ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే బాకీ పడ్డట్టా? అని బీఆర్ఎస్ నేతలను మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. ‘‘బాకీ కార్డు అంటూ ప్రచారం చేసే అర్హత బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎక్కడిది? దళిత సీఎం హామీ, కేజీ టు పీజీ విద్య, దళితులకు మూడెకరాల భూమి, గిరిజనులకు రిజర్వేషన్లు వంటి హామీలన్నీ ఇచ్చి నెరవేర్చకుండా బాకీ పడ్డది మీరు కాదా?” అని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. కాళేశ్వరం కూలేశ్వరం కావడం, ఫార్ములా కార్ రేసు, పలు ప్రభుత్వ పథకాల్లో చేసిన స్కాంలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో.. దిక్కుతోచని బీఆర్ఎస్ నేతలు బాకీ కార్డు పేరుతో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మోసపూరిత ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్సే చాంపియిన్..

మాట ఇస్తే నిలుపుకునే పార్టీ కేవలం కాంగ్రెస్ ఒక్కటేనని, బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో ఇది మరోసారి రుజువైందని మహేశ్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్లకు చాంపియన్ కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు. ‘‘పదేండ్ల పాటు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై పరిపాలన చేశాయి. ఈ పార్టీల నేతలు బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా తెరవెనుక ఉంటూ కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారు. ఈ రెండు పార్టీలు ఒక్కటై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విష ప్రచారం చేస్తున్నాయి. ఇది తెలంగాణ సమాజం గమనించాలి” అని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీని అడిగే దమ్ము, ధైర్యం బీజేపీ బీసీ ఎంపీలైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేదన్నారు. బీసీల నోటికాడి ముద్దను బీజేపీ లాక్కునే ప్రయత్నం చేస్తున్నదని ఫైర్ అయ్యారు. బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ఎందుకు ముందుకు రావడం లేదో తెలంగాణలోని బీసీ సమాజానికి వివరించాలని కోరారు. పార్టీలకు అతీతంగా బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని నేతలను కోరారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేసేందుకు సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని, కోర్టు తీర్పు కూడా సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.  


ఆదిత్య కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ ​కంపెనీ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అధ్యయనం చేయాలి..

ఆదిత్య కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ కంపెనీ నిర్మిస్తున్న కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని,నది పక్కనే ఈ నిర్మాణం సాగుతున్నట్టు కనిపిస్తోందని, దీనిపై అనుమానాలు ఉన్నాయని మహేశ్ గౌడ్ అన్నారు. ఏ లోపాలు, తప్పులను తన దృష్టికి తీసుకువచ్చినా పీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతానని చెప్పారు. ‘‘హైడ్రా వల్ల బడా నేతల భూములు మాత్రమే పోతున్నాయి. హైడ్రా టార్గెట్ పేదలు కాదు. గాజులరామారంలో వేల కోట్ల ఆస్తులను హైడ్రా కాపాడింది” అని పేర్కొన్నారు. మూసీ సుందరీకరణను కేంద్రమంత్రి కిషన్ రెడ్డే  అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో 8‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 శాతం సీట్లను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఉనికి కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నదని, కానీ ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే తమకు రక్షణ కవచంలా ఉంటాయని, తమ పార్టీని ప్రజలు ఆదరించి గెలిపిస్తారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

నిరుద్యోగుల కలలు సాకారం చేస్తే బాకీ పడ్డట్టా? మీరు ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు? మీ పాలనలో ఎంత మందికి దళిత బంధు ఇచ్చారు. మేం రూ.500 సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ ఇస్తే బాకీ పడ్డట్టా? 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తే బాకీ పడ్డట్టా? ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచితే బాకీ పడ్డట్టా? రైతులకు రుణమాఫీ చేయడం, రైతు భరోసా ఇవ్వడం, సన్న వడ్లకు బోనస్ ఇవ్వడం, రేషన్ కార్డులు ఇవ్వడం, సన్న బియ్యం పంపిణీ చేయడం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే బాకీ పడ్డట్టా? వీటికి బీఆర్‌‌ఎస్ నేతలు సమాధానం చెప్పాలి. – పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​