ఓట్ చోరీపై గ్రామాల్లో సంతకాల సేకరణ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ఓట్ చోరీపై గ్రామాల్లో సంతకాల సేకరణ :  పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • ఓట్​ చోరీతోనే బీజేపీకి కేంద్రంలో మూడోసారి అధికారం: పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్

హైదరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీ ప్రారంభించిన ఓట్ చోరీ ఉద్యమానికి దేశ వ్యాప్తంగా మద్దతు కూడగట్టడంలో భాగంగా తెలంగాణలో ప్రతి గ్రామం నుంచి వంద మంది సంతకాల సేకరణ చేయనున్నట్లు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చెప్పారు. శనివారం గాంధీ భవన్​లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రారంభించిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పీసీసీ చీఫ్ ప్రారంభించారు. 

అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో మోదీ మూడోసారి అధికారంలోకి రావడానికి ఓట్ చోరీయే కారణమనే విషయాన్ని గ్రామ స్థాయిలో బలంగా తీసుకెళ్తామని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు రావడానికి ఓట్ చోరీయే కారణమని తాను చేపట్టిన జనహిత పాదయాత్రలో ఆరోపిస్తే దానిపై ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సైలెంట్​గా ఉన్నారని గుర్తు చేశారు. 

రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా బీఆర్ఎస్, బీజేపీలు కుట్ర పన్ని అడుగడుగునా అడ్డుతగులుతున్నాయని విమర్శించారు. ప్రజాదరణ ఉన్న వారికే జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తామని, తాము నిర్వహిస్తున్న సర్వేలో ఎవరు ముందంజలో ఉంటే వారికే టికెట్ దక్కుతుందని చెప్పారు.