ఏ క్షణమైనా డీసీసీ చీఫ్‌‌ల నియామక ప్రకటన : మహేశ్‌‌గౌడ్

ఏ క్షణమైనా డీసీసీ చీఫ్‌‌ల నియామక ప్రకటన : మహేశ్‌‌గౌడ్
  • జూబ్లీహిల్స్‌‌ తీర్పుతో రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్‌‌కు స్థానం లేదని తేలిపోయింది: మహేశ్‌‌గౌడ్​

హైదరాబాద్, వెలుగు:  
డీసీసీ అధ్యక్షుల నియామక ప్రకటన ఏ క్షణమైనా వెలువడవచ్చని పీసీసీ చీఫ్ మహేశ్‌‌కుమార్‌‌‌‌గౌడ్​ తెలిపారు. ఇప్పటికే దీనిపై ఏఐసీసీ కసరత్తు పూర్తి చేసిందని, చివరగా తమ అభిప్రాయాలను కూడా తెలుసుకున్నదని, ఇక జాబితా ప్రకటనే తరువాయి అని వివరించారు.  సోమవారం గాంధీ భవన్‌‌లో మహేశ్‌‌గౌడ్‌‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. 

రాష్ట్రంలో బీఆర్ఎస్‌‌కు ఇక స్థానం లేదని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తీర్పుతో ఇది స్పష్టమైందని చెప్పారు. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌‌కు చెందిన వారు మరణించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, అక్కడ జరిగిన ప్రమాదం, సహాయక చర్యలపై మంత్రులు అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.  

ప్రభుత్వం హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసిందన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటే మజ్లిస్ పార్టీ ఉందని, ఈ విషయాన్ని స్వయంగా ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారని గుర్తు చేశారు. బిహార్‌‌‌‌లో మజ్లిస్ అవలంబించిన విధానం వేరని, రాష్ట్రాలను బట్టి రాజకీయ అవసరాలు, నిర్ణయాలు మారుతూ ఉంటాయని తెలిపారు.

ఓట్ల చోరీకి వ్యతిరేకంగా నేటి నుంచి సంతకాల సేకరణ


ఓటు చోరీకి వ్యతిరేకంగా మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. సోమవారం గాంధీ భవన్‌‌లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓటు చోరీకి వ్యతిరేకంగా నిరసన సభ జరిగింది. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయభాను పాల్గొన్న ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్టుగా పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హాజరై, మాట్లాడారు. గతంలో తెలంగాణలో కూడా ఈ ఓటు చోరీ జరిగిందని, దేశంలో బీజేపీ కేవలం ఓటు చోరీతోనే అధికారంలోకి వస్తుందని ఆరోపించారు. బిహార్‌‌‌‌లో ప్రజా తీర్పుకు విరుద్ధంగా అక్కడ ఎన్డీయే విజయం సాధించిందన్నారు.   

ఓట్‌‌ చోరీతోనే అధికారంలోకి..: మంత్రి పొన్నం 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీతోనే అధికారంలోకి వచ్చిందని, ఇది ఎలా జరుగుతుందో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆధారాలతో నిరూపించినా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ నేతలు ఓటు చోరీపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. 

ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొన్నారు. సభ అనంతరం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా గాంధీ భవన్ ఎదుట ఉన్న ప్రధాన రాహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్ల కార్డులు పట్టుకొని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్‌‌కు అంతరాయం కలగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీస్‌‌ స్టేషన్‌‌కు తరలించారు.