- అందుకే గాంధీ పేరు తొలగించారు
- పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్
- నేడు జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలకు పిలుపు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేతృత్వంలోని నాటి యూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపన్నుతోందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం అన్యాయమని మంగళవారం ఓ ప్రకటనలో ఆయన విమర్శించారు. దీనికి నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో గాంధీ విగ్రహాల వద్ద ఆయన చిత్రపటాలతో నిరసన తెలియజేయాలని పార్టీ క్యాడర్ కు మహేశ్ గౌడ్ పిలుపునిచ్చారు.
అలాగే జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఏఐసీసీ ఇచ్చిన ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం అమలు బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు కేంద్రం కుట్రపన్నుతోందన్నారు. గ్రామీణ ప్రాంత కూలీలకు ఎంతో భరోసాగా ఉన్న పథకాన్ని నీరుగార్చే ప్రయత్నాన్ని అడ్డుకుంటామన్నారు.
