- కాళేశ్వరం మీద ఆయన మాటలు ఆశ్చర్యం కలిగించాయి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- తొమ్మిదిన్నరేండ్లలో నీటిని ఎందుకు రిలీజ్చేయలేదో కేటీఆర్ చెప్పాలని సవాల్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడిన తీరుచూస్తే ఆయన బీజేపీ నేతో, లేదంటే బీఆర్ఎస్ ఏజెంటో అర్థం కావడం లేదని పీసీసీ చీఫ్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మేడిగడ్డ సహా కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదని, భద్రతా కారణాల వల్ల నీటిని లిఫ్ట్ చేయవద్దని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్‌డీఎస్ఏ చెప్పింది. కానీ, ఈటల రాజేందర్ మాత్రం కేటీఆర్ మాదిరిగా నీటిని ఎత్తిపోయాలని చెప్తున్నారు.
కేటీఆర్ టెక్నికల్ నిపుణుడు కాదుకదా! అసలైన నిపుణులు ఎన్‌డీఎస్‌ఏ అధికారులు. ఈటల రాజేందర్.. ఢిల్లీకి పోయి ప్రధాని మోదీని అడిగితే బాగుంటుంది’ అని పీసీసీ చీఫ్చురక అంటించారు. ఈటల మాటల్లో బీజేపీ లైన్ ఉందా? బీఆర్‌ఎస్ స్క్రిప్ట్ ఉందా? అనే విషయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని తాము మొదటి నుంచి చెప్తూనే ఉన్నామని.. ఇప్పుడు అది వంద శాతం నిజమైందని అభిప్రాయపడ్డారు. ప్రజాక్షేత్రంలో ఈ రెండు పార్టీల కపట నాటకాలను కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు ఎండగడుతుందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హెచ్చరించారు.
కేటీఆర్‌ది అనుభవరాహిత్యం
కాళేశ్వరాన్ని వారం రోజులు తమకు అప్పగిస్తే నీళ్లు ఇస్తామని కేటీఆర్ చెప్తున్నాడని.. మరి గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో ఏం చేశారో చెప్పాలని మహేశ్గౌడ్నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలపై కేటీఆర్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే బాగుండేదని అన్నారు. నాణ్యతా లోపంతో ఉన్న ప్రాజెక్టుల్లో పంపులు ఆన్ చేస్తే ఏమవుతుందో కేటీఆర్ కు తెలియదా? అని ఫైర్ అయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల నాణ్యత అనుమానాస్పదంగా ఉన్నాయనే వాస్తవం కేటీఆర్ కు తెలియదా? అని ప్రశ్నించారు.
వర్షాభావంతో నీళ్లు లేని సమయంలో సముద్రంలోకి నీళ్లను వదులుతున్నారంటూ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు ఆయన అనుభవ రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇంజనీర్లను కూడా పక్కన పెట్టి, నేనే ఇంజనీర్ ను అంటూ కేసీఆర్ నియంతృత్వ పోకడలకుపోవడంతోనే కాళేశ్వరం కూళేశ్వరంగా మారిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, దీనిపేరుతో కేసీఆర్ కుటుంబం వేలకోట్ల అవినీతికి పాల్పడిందని పీసీసీ చీఫ్ ఆరోపించారు. మరోసారి కాళేశ్వరంపై తప్పుడు ఆరోపణలు చేస్తే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు.
