పొన్నం వ్యాఖ్యలతో కాంగ్రెస్కు సంబంధం లేదు..అవి పూర్తిగా మంత్రి వ్యక్తిగతం :  పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

పొన్నం వ్యాఖ్యలతో కాంగ్రెస్కు సంబంధం లేదు..అవి పూర్తిగా మంత్రి వ్యక్తిగతం :  పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. పొన్నం వ్యాఖ్యలతో రాష్ట్ర కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదని మంగళవారం పీసీసీ చీఫ్ హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళలు, బాలికల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, పోక్సో చట్టాన్ని తీసుకువచ్చిందే కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో ఉన్న నిందితులకు చట్టపరమైన శిక్షలు పడేలా తమ పార్టీ చిత్తశుద్ధితో పోరాడుతుందన్నారు.

ఈ కేసు 25 ఏళ్ల నిందితుడు, 17 ఏళ్ల బాలిక(మైనర్)కు సంబంధించిన వ్యవహారం అని, ఇందులో తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున ‘‘పరస్పర అంగీకారం’’ అనే విషయాన్ని పొన్నం వాడినందున దాన్ని కాంగ్రెస్ సమర్థించదని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. అలాగే‘‘సామాజిక రాజీ’’ తో సమస్యను పరిష్కరించుకోవచ్చనే విధంగా పొన్నం మాట్లాడారని, దీన్ని కూడా పీసీసీ సమ్మతించదని పేర్కొన్నారు. ఈ రెండు పదాలను పొన్నం తన వ్యాఖ్యల్లో  ప్రస్తావించినందున.. వాటిని కాంగ్రెస్ ఎట్టిపరిస్థితుల్లో సమర్థించదని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.