- సమాజంలోని అన్ని వర్గాలూ మాకు సమానమే అని వ్యాఖ్య
- మైనార్టీల సంక్షేమం.. ప్రభుత్వ బాధ్యత: మంత్రి వివేక్
- ముస్లింల సమస్యలు పరిష్కరించినం: మంత్రి పొన్నం
- కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ నేతలతో సమావేశం
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనార్టీలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటేసి గెలిపించాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కోరారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఓ హోటల్ లో మంగళవారం పార్టీ సీనియర్ మైనార్టీ నేతలతో మహేశ్ గౌడ్, మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, షబ్బీర్ అలీ, అజారుద్దీన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని, వారి హక్కులు కాపాడేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. సమాజంలో అన్ని వర్గాల వారిని సమానంగా చూసే ఏకైక పార్టీ కాంగ్రెస్ యేనని, మైనార్టీలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యత తీసుకోవాలని కోరారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ముందున్నదని, ఇప్పటికే పలు సమస్యలను పరిష్కరించామని మంత్రి వివేక్ తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి పలు పథకాలను అమలు అయ్యేలా చూస్తామన్నారు. కేవలం 2 నెలల్లోనే ఈ నియోజకవర్గంలో ముస్లింల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి చాలా సమస్యల వరకు పరిష్కరించామని అన్నారు.
కాంగ్రెస్ మొదటి నుంచి ముస్లింలకు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నదని, వారి సంక్షేమం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని అన్నారు. తమ ప్రభుత్వానికి ఇప్పుడు ముస్లింల మద్దతు అవసరమని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు పూర్తి అండగా నిలిచి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. ఇన్చార్జ్ మంత్రిగా తాను గత రెండేండ్లుగా ముస్లింలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ముస్లింలకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించామని, రాబోయే రోజుల్లో కూడా తమ ప్రభుత్వం వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.
