- సీఎం రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్
- జడ్పీటీసీ నుంచి సీఎం స్థాయికి ఎదిగారని ప్రశంస
- అంకితభావంతోనే రేవంత్ రెడ్డి ఈ స్థాయికి: షబ్బీర్ అలీ
హైదరాబాద్, వెలుగు: రెండున్నరేండ్లలోనే సీఎంగా అత్యంత ప్రజాదారణ పొందిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని, భవిష్యత్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని పీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డి తన 20 ఏండ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం మీడియాకు పీసీసీ చీఫ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మిడ్జిల్ మండల జడ్పీటీసీగా రేవంత్‌రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించి, మొక్కవోని ధైర్యంతో అనేక రాజకీయ ఒత్తిళ్లను తట్టుకొని తన లక్ష్యాన్ని సాధించారని తెలిపారు. లోకల్ బాడీలో ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పీసీసీ చీఫ్ గా రాజకీయాల్లో అన్ని వ్యవస్థల్లో పనిచేసిన అనుభవం ఉన్న గొప్ప నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని ప్రశంసించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.
రేవంత్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి : షబ్బీర్ అలీ
ప్రజాసేవ పట్ల ఉన్న అంకితభావంతోనే రేవంత్ రెడ్డి 20 ఏండ్లలో జడ్పీటీసీ నుంచి సీఎం స్థాయికి ఎదిగారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న నిబద్దతకు నిదర్శనమన్నారు. రెండు దశాబ్దాలుగా రేవంత్‌రెడ్డి నాయకత్వం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తినిచ్చిందని ప్రశంసించారు. సీఎం నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
స్వీట్లు పంచుకున్న కాంగ్రెస్ శ్రేణులు..
సీఎం రేవంత్ రెడ్డి తన 20 ఏండ్ల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం గాంధీ భవన్ లో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచిపెట్టి పటాకులు కాల్చారు. సీఎం రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
