
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇప్పుడున్న దొంగ ఓట్లన్నీ బీఆర్ఎస్ హయాంలోనే నమోదు చేశారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. చీఫ్ సెక్రటరీగా, బల్దియా కమిషనర్‌గా సోమేశ్ కుమార్ ఉన్న సమయంలోనే లక్షల్లో దొంగ ఓట్లు సృష్టించారని చెప్పారు. ఇప్పుడు వాళ్లే దొంగ ఓట్లపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
అసలు దొంగ ఓట్లపై పోరాటం చేస్తున్నదే రాహుల్ గాంధీ అని, కాంగ్రెస్ పార్టీకి దొంగ ఓట్లు సృష్టించే అవసరం లేదన్నారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని ఆర్వో కార్యాలయం మీడియా పాయింట్ వద్ద మహేశ్ గౌడ్ మాట్లాడారు. కేసీఆర్ వచ్చి ప్రచారం చేసినా జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలవదన్నారు. కంటోన్మెంట్‌లో మాదిరి జూబ్లీహిల్స్‌లోనూ కాంగ్రెస్‌నే గెలుస్తుందని, నవీన్ యాదవ్ 50 వేలకు పైగా మెజారిటీ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
సీపీఐ నేతలతో భేటీ..
మిత్రపక్షాల ఐక్యతే తమ బలం అని పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మగ్దూం భవన్‌లో సీపీఐ ముఖ్య నేతలతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మద్దతు, బీసీ జేఏసీ బంద్‌పై సీపీఐ నేతలతో చర్చించినట్టు చెప్పారు.
కాంగ్రెస్ సర్కార్‌కు సీపీఐ మద్దతుగా నిలుస్తున్నదని, ఇది భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఆకాంక్షించారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. సమావేశంలో సీపీఐ నాయకులు నారాయణ, పల్లా వెంకట్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీసీ బంద్‌కు కాంగ్రెస్ మద్దతు..
బీసీ బంద్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్టు పీసీసీ చీఫ్మహేశ్గౌడ్ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉన్నదని చెప్పారు. బంద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.